ఇస్లామాబాద్, ఏప్రిల్ 11: ప్రపంచ ఇంధన మార్కెట్లను స్తంభింపచేసి వాణిజ్యానికి అంతరాయం కలిగించిన పశ్చిమాసియా యుద్ధాన్ని ముగించేందుకు శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని అమెరికా ప్రతినిధి బృందం శనివారం ఇస్లామాబాద్‌లో ఇరాన్ ప్రతినిధులతో చారిత్రాత్మక ముఖాముఖీ చర్చలు జరిపింది. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరు పక్షాల మధ్య జరుగుతున్న మొట్టమొదటి ప్రత్యక్ష ఉన్నత స్థాయి చర్చలకు పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహిస్తుండగా ఒక కీలక పురోగతి సాధిస్తారనే అంచనాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ చర్చలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
ఇస్లామాబాద్‌లో జరగనున్న త్రైపాక్షిక చర్చలకు ముందు వాన్స్ నేతృత్వంలోని అమెరికా బృందం, పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఘాలిబాఫ్ నేతృత్వంలోని ఇరాన్ ప్రతినిధి బృందం పాకిస్థాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్‌తో వేర్వేరుగా సమావేశమయ్యాయి. పాక్ ప్రధాని షరీఫ్ ఇరు దేశాల ప్రతినిధి బృందాలతో విడివిడిగా సమావేశాలు నిర్వహించిన అనంతరం ఇరాన్, అమెరికాల మధ్య ప్రత్యక్ష చర్చల అధికారిక దశ ప్రారంభమైందని ఒక సీనియర్ పాకిస్థానీ అధికారి పీటీఐకి తెలిపారు. హొర్ముజ్ జలసంధిపై చర్చల్లో ప్రతిష్ఠంభన నెలకొన్నట్టు తెలిసింది.
చర్చలు వాడీవేడిగా సాగుతున్నాయని, రెండు వైపులా మూడ్ స్వింగ్స్ చూస్తున్నామని పాక్ అధికారి ఒకరు తెలిపారు. అయితే చర్చల పురోగతిపై రెండువైపులా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. చర్చలకు ముందు ఇరాన్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ఖతార్తోపాటు, ఇతర విదేశీ బ్యాంకుల్లో స్తంభింపజేసిన తమ నిధులను విడుదల చేసేందుకు అమెరికా అంగీకరించిందని తెలిపారు. అయితే శ్వేతసౌధం ఈ వార్తలను ఖండించింది. నిధుల విడుదలతోపాటు హొర్ముజ్‌పై నియంత్రణ, యుద్ధ నష్టపరిహారం, లెబనాన్ సహా ఈ ప్రాంతమంతటా కాల్పుల విరమణకు ఇరాన్ పట్టుబడుతున్నది. మరోవైపు హొర్ముజ్‌లో స్వేచ్ఛాయుత నౌకా రవాణాతోపాటు ఇరాన్ యురేనియం శుద్ధిని పూర్తిగా నిలిపివేయాలని ట్రంప్ డిమాండ్చేస్తున్నారు. మరోవైపు లెబనాన్‌పై ఇజ్రాయెల్ తమ దాడులను కొనసాగిస్తున్నది. కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్ భాగం కాదన్నది ఇజ్రాయెల్ వాదన.
ఇరాన్ ముందస్తు షరతుల కారణంగా శాంతి చర్చలు 5 గంటలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. అవి ఎలా సాగుతాయో తనకు తెలియదని, చాలా తక్కువ సమయంలోనే ఇరాన్ చిత్తశుద్ధిని అంచనావేస్తామని పేర్కొన్నారు. చర్చలు విఫలమైతే ఇరాన్‌పై భీకర దాడులు చేస్తామని హెచ్చరించారు.
శాంతి చర్చలు కొనసాగుతున్నవేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికాకు చెందిన రెండు యుద్ధ నౌకలు హొర్ముజ్ జలసంధిని దాటినట్టు తెలుస్తున్నది. ఇరాన్‌తో యుద్ధం మొదలైన తర్వాత అమెరికా యుద్ధ నౌకలు హొర్ముజ్‌ను దాటడం ఇదే మొదటిసారి. అయితే ఈ వార్తలను ఇరాన్ ఖండించింది.
హొర్ముజ్ జలసంధిని శుభ్రపరిచే కార్యక్రమాన్ని అమెరికన్ సైన్యం ప్రారంభించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంతకుముందు ఎక్స్ వేదికగా తెలిపారు. అలాగే ఇరాన్‌కు చెందిన సముద్ర మందు పాతరలు(సీమైన్స్) అమర్చే నౌకలన్నిటినీ తమ సైన్యం ముంచివేసినట్లు కూడా ఆయన పేర్కొన్నారు. స్వయంగా చేసుకునే ధైర్యం లేదా సంకల్పం లేని అమెరికా మిత్రదేశాలతోసహా అన్ని దేశాల కోసం తాము ఈ ఉపకారం చేస్తున్నామని ట్రంప్ శనివారం ట్రూత్ సోషల్ పోస్టులో పేర్కొన్నారు.