రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. తమ బలగాలు ఉక్రెయిన్ సరిహద్దుల నుంచి వెనక్కి తెచ్చామని పుతిన్ చెబుతున్నా…. అమెరికా, నాటో అది తప్పని తేల్చేస్తున్నాయి. కచ్చితంగా కొన్ని రోజుల్లోనే రష్యా ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతుందని అమెరికా అధ్యక్షుడు తేటతెల్లం చేశారు. అయితే రష్యా మొట్ట మొదట ఏ ప్రాంతంపై దాడి చేస్తుంది? ఇంటెలిజెన్స్ రిపోర్టుల ప్రకారం రష్యా మొట్ట మొదట ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై దాడి చేస్తుందని ఆ ఇంటెలిజెన్స్ రిపోర్టుల ద్వారా తెలుస్తోంది.
కీవ్ లక్ష్యంగానే రష్యా విరుచుకుపడుతుందని తెలుస్తోంది. ఈ విధంగానే రష్యా ఓ వ్యూహాన్ని రచించినట్లు సమాచారం. ఈ కీవ్‌లో మొత్తం 28 లక్షలకు పైగా నివాసముంటున్నారు. ఒక వేళ రష్యా గనక ఈ కీవ్‌పై విరుచుకుపడితే.. ఇన్ని లక్షల మంది భవితవ్యం అగమ్యగోచరమేనని ఓ వర్గం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది.
ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలో పేలుళ్లు..
ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని డొనెస్టెక్ ప్రాంతంలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఈ ప్రాంతం వేర్పాటువాదుల అధీనంలో ఉంటుంది. అయితే ఈ పేలుళ్లకు కారణాలేమిటో మాత్రం తెలియడం లేదు. రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసే అవకాశాలున్నాయన్న వార్తల నేపథ్యంలో ఈ పేలుళ్లకు ప్రాధాన్యం ఏర్పడింది.