Indian workers : రష్యాలో భారత కార్మిక శక్తికి డిమాండ్ పెరుగుతోంది. రష్యన్ కంపెనీలు ముఖ్యంగా యంత్రాలు, ఎలక్ట్రానిక్స్ రంగాల్లోని సంస్థలు భారతీయులను నియమించుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయని అక్కడి భారత రాయబారి వినయ్ కుమార్ తెలిపారు. రష్యాలో ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు భారతీయుల సంఖ్య పెరుగుతుండటంతో కాన్సులర్ సేవలను మరింత విస్తరిస్తున్నట్లు చెప్పారు.
అమెరికా, బ్రిటన్ తదితర పాశ్చాత్య దేశాలు వలసలపై ఆంక్షలు విధిస్తున్న వేళ ఈ పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రష్యాలో మానవ వనరుల అవసరం ఉందని, భారత్ వద్ద నైపుణ్యం కలిగిన కార్మిక శక్తి ఉందని, ఈ క్రమంలోనే స్థానిక చట్టాలను అనుసరించి కంపెనీలు భారతీయులను నియమించుకుంటున్నాయని ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వినయ్ కుమార్ చెప్పారు.
రష్యాకు వలస వచ్చిన వారిలో ఎక్కువ మంది నిర్మాణ, వస్త్ర రంగాల్లో ఉపాధి పొందుతున్నారని, యంత్రాలు, ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో భారతీయులకు డిమాండ్ పెరుగుతోందని అన్నారు. స్థానికంగా భారతీయ కార్మికుల సంఖ్య పెరుగుతుండటంతో పాస్‌పోర్ట్‌ల పొడిగింపు వంటి కాన్సులర్ సేవలను విస్తరిస్తున్నట్లు తెలిపారు. కాగా అధికారిక లెక్కల ప్రకారం.. రష్యాలో దాదాపు 14 వేల మంది భారతీయులు ఉన్నారు. స్థానిక విద్యాసంస్థల్లో దాదాపు 4,500 మంది మన విద్యార్థులు చదువుతున్నారు.
ఉక్రెయిన్ యుద్ధానికి తోడు యువ రష్యన్లు ఫ్యాక్టరీల్లో పని చేసేందుకు విముఖత చూపుతుండటం వంటి కారణాలతో 2030కల్లా రష్యాలో 31 లక్షల మంది కార్మికులకు కొరత ఏర్పడనున్నట్లు అంచనా. ఈ నేపథ్యంలో ఇక్కడి పారిశ్రామిక ప్రాంతాల్లో కార్మిక కొరతను తీర్చడానికి ఈ ఏడాది చివరికల్లా నిపుణులైన 10 లక్షల మంది భారతీయ కార్మికులను తీసుకోవాలని మాస్కో వ్యూహకర్తలు భావిస్తున్నట్లు ఈ మధ్య వార్తా కథనాలు వెలువడ్డాయి.