Indian Students | లండన్, అక్టోబర్ 26: బ్రిటన్‌లో భారతీయ విద్యార్థుల కష్టాలు వర్ణణాతీతంగా ఉన్నాయి. ఉన్నత చదువుల కోసం అక్కడికి వెళ్లిన విద్యార్థులు నిలువ నీడలేక హాహాకారాలు చేస్తున్నారు. ముగ్గురు నలుగురు ఉండాల్సిన గదుల్లో 8-10 మంది సర్దుకొంటూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పడుకోవటానికి చోటు లేని గదులకు కూడా ఒక్కో విద్యార్థి నెలకు రూ.లక్షకుపైగానే అద్దె చెల్లించాల్సి వస్తున్నది. ఆర్థిక మందగమనంలో ఉన్న బ్రిటన్‌లో నివాస భవనాల నిర్మాణం తగ్గుముఖం పట్టడంతో భారతీయ విద్యార్థులకు అద్దె ఇల్లు దొరకబట్టుకోవటం భగీరథ ప్రయత్నంగా మారింది.
అసలే ఇరుకు గదులు.. అయినా లక్షల్లో అద్దె చెల్లించాల్సి వస్తున్నదని విద్యార్థులు వాపోతున్నారు. యూనివర్సిటీ కాలేజ్ లండన్ (యూసీఎల్)లో ఇటీవలే డిగ్రీ పూర్తిచేసిన శ్రద్ధా చక్రవర్తి తన గోడును వెళ్లబోసుకున్నారు. లండన్‌లోని కింగ్స్ క్రాస్ ప్రాంతంలో అద్దెకు ఉన్న ఆమె వారానికి ఇంటి అద్దె రూ.30,124 (299 పౌండ్లు) చెల్లించినట్టు తెలిపారు. ఈ లెక్కన నెలకు ఇంటి అద్దె రూ.1.2 లక్షలకు పైమాటే. అంటే ఒక గదిలో నలుగురు విద్యార్థులు అద్దెకు ఉంటే.. అందరూ కలిసి నెలకు అక్షరాలా రూ.5 లక్షలు అద్దె చెల్లించాల్సి వస్తున్నది. ‘ఐదుమంది మాత్రమే ఉండగలిగే గదిలో 8 మందిమి సర్దుకొంటున్నాం. అందరికీ ఒకటే స్నానాల గది. ఒకటే వంటగది. అద్దె ఇల్లు వెతుక్కోవటంలోనే నా సమయమంతా గడిచిపోతున్నది. చదువు అయిపోయిన తర్వాత నాకు చాలాకాలం ఉద్యోగం లభించలేదు. ఎక్కడా పార్ట్‌టైమ్ ఉద్యోగం కూడా దొరకలేదు. దీంతో నా చేతిలో 30 పౌండ్లు మాత్రమే మిగిలాయి. రూమ్‌లో అందరూ తినగా మిగిలిన ఆహారాన్ని తినేవాడిని. ఎట్టకేలకు ఓ ఇండియన్ రెస్టారెంట్లో జాబ్ సంపాదించాను. అందులో ఏడాదిపాటు పనిచేసిన తర్వాత ఇప్పుడు హెల్త్‌కేర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాను’ అని ఎమ్మెస్సీ సైప్లె చైన్ మేనేజ్మెంట్ కోర్సు చదవటానికి వెళ్లిన అరుణ్పాట్రిక్ అనే విద్యార్థి తన గోడు వెళ్లబోసుకొన్నాడు. ఇతడు కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో బ్రిటన్ వెళ్లాడు. ఇప్పటికీ అక్కడ పరిస్థితులు ఏమీ మారలేదని పలువురు విద్యార్థులు తెలిపారు.
మంచి అద్దె ఇల్లు వెతుక్కోవటానికి తనకు ఆరు నెలల సమయం పట్టిందని యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్‌లో ఇటీవలే చేరిన సిమ్రన్ మెలాల్ తెలిపారు. ఇలా అద్దె ఇండ్ల సంక్షోభం ఏర్పటడానికి కారణం బ్రిటన్‌లో ఆర్థిక మందగమనమే. 2020లో ఆ దేశంలో విద్యార్థుల కోసం ప్రత్యేకంగా 29,048 గదులను నిర్మించగా, 2023 నాటికి అది 13,543కు పడిపోయింది. విద్యార్థుల వలస మాత్రం పెరుగుతూనే ఉన్నది. 2019లో 36,612 మంది భారతీయ విద్యార్థులు బ్రిటన్ వెళ్లగా, ఆ సంఖ్య 2021నాటికి 77,855కు చేరింది. 2022 సంవత్సరంలో బ్రిటన్‌లో 55,465 మంది భారతీయ విద్యార్థులు ఉన్నట్టు కేంద్రప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. కొత్తగా ఇండ్లు కట్టడానికి భూమి సరిపోకపోవటంతో విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఇండ్లు నిర్మించటాన్ని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎడిన్‌బరో ప్రాంతంలో ఇటీవల ఓ కంపెనీ భారీ స్థాయిలో విద్యార్థుల గదుల నిర్మాణానికి పూనుకోగా స్థానికులు అడ్డుకొన్నారు. చాలాప్రాంతాల్లో ఆసియా విద్యార్థులకు ఇండ్లు అద్దెకు ఇచ్చేందుకు ఓనర్లు నిరాకరిస్తున్నారు.