వాషింగ్టన్: ఇరాన్ చర్చలకు దిగి వచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొద్ది గంటలకే రెండు దేశాల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు ప్రారంభమయ్యాయి. హొర్ముజ్ జలసంధిలోని మూడు అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ డ్రోన్లతో విరుచుకుపడింది. జలసంధిలో గస్తీ కాస్తున్న నౌకలపై దాడులు చేసింది. రెండు దేశాల పరస్పర దాడుల్లో భారత్‌కు చెందిన ఒక సరుకు రవాణా నౌక గురువారం రాత్రి హొర్ముజ్ జలసంధి వద్ద మునిగిపోయింది. ఈ ఘటనలో ఒక భారతీయుడు మరణించాడు. గుజరాత్‌లోని ద్వారకా జిల్లా సాలయకు చెందిన ఈ రవాణా నౌకలో ఇంజిన్ రూమ్‌లో పనిచేస్తున్న అల్తాప్ తలాబ్ కేర్ ఈ ప్రమాదంలో మరణించగా, మిగిలిన 17 మంది నౌకా సిబ్బందిని రక్షించారు. ఈ విషయాన్ని ఇండియన్ సెయిలింగ్ వెస్సల్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆడమ్ భాయ్ వెల్లడించారు.
ఎంఎస్వీ అల్ ఫైజ్ నూర్ సులేమనీ-1 అనే ఈ రవాణా నౌక సరుకుతో దుబాయ్ నుంచి యెమెన్‌లోని ముకాలియా పోర్టుకు వెళ్తున్నది. ఆ సమయంలో నౌకలో ఒక గన్‌మేన్ సహా 18 మంది సిబ్బంది ఉన్నారు. గురువారం రాత్రి ఒంటి గంటకు హొర్ముజ్ జలసంధి మీదుగా వెళ్తుండగా హఠాత్తుగా ఇరాన్-అమెరికా నావికా దళాల మధ్య కాల్పులు మొదలయ్యాయి. ఆ కాల్పుల మధ్య ఈ నౌక చిక్కుకుపోయి తీవ్రంగా దెబ్బతింది. దీంతో నౌక మునిగిపోవడం ప్రారంభించింది. దీంతో నౌకలోని సిబ్బంది తమను తాము రక్షించుకోవడానికి ప్రయత్నించారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న పీఎస్వీ ప్రేమ్ సాగర్-1 అనే నౌక సిబ్బంది ఇందులోని 17 మందిని రక్షించారు. ఈ దాడిలో ఇంజిన్ రూమ్‌లో ఉన్న అల్తాప్ తలబ్ కేర్ తీవ్రంగా గాయపడి అక్కడే మరణించాడు. రక్షించిన వారినందరినీ శుక్రవారం సాయంత్రం నాటికి దుబాయ్ పోర్టుకు చేర్చారు.
యూఎస్ యుద్ధ నౌకలపై ఇరాన్ దాడి అనంతరం ఇరాన్‌లోని క్షిపణి లాంచ్ సైట్లు, కమాండ్ సెంటర్లపై అమెరికా దాడులు చేసింది. హొర్ముజ్ జలసంధిలో మూడు రక్షక దళ నౌకలపై జరిగిన దాడులను తాము తిప్పికొట్టామని, ఇరాన్ సైనిక స్థావరాలపై ప్రతీకారం తీర్చుకున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం ట్రూత్ సోషల్‌లో ప్రకటించారు. ఇది జరిగిన కొన్ని గంటల తర్వాత తమపై క్షిపణి దాడులు జరిగినట్టు యూఏఈ తెలిపింది.