వాషింగ్టన్: విమానం కూలిన ఘటనలో భారత సంతతికి చెందిన సర్జన్ జోయ్ సైనీ మరణించింది. (Indian-origin surgeon dies) భర్త నడిపిన విమానం ప్రమాదానికి గురికావడంతో ఆమెతో పాటు భర్త, ఇద్దరు పిల్లలు వారి కాబోయే జీవిత భాగస్వాములు చనిపోయారు. అమెరికాలోని న్యూయార్క్‌లో ఈ సంఘటన జరిగింది. శనివారం సైనీ కుటుంబం, మరో ఇద్దరు కలిసి విమానంలో ప్రయాణించారు. సైనీ భర్త మైఖేల్ గ్రోఫ్ పైలట్‌గా ఉన్న ఆ విమానం వెస్ట్చెస్టర్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయ్యింది.
కాగా, కొలంబియా కౌంటీ ఎయిర్‌పోర్ట్‌లో విమానాన్ని ల్యాండ్ చేసేందుకు పైలట్ అయిన సైనీ భర్త ప్రయత్నించి విఫలమయ్యాడు. మరోసారి ప్రయత్నించే క్రమంలో ఆ విమానం కూలిపోయింది. సైనీ, న్యూరో సర్జన్ అయిన భర్త మైఖేల్ గ్రోఫ్. వైద్య విద్యార్థిని అయిన కుమార్తె కరెన్నా గ్రోఫ్, ఆమె కాబోయే భర్త జేమ్స్ శాంటోరో, కుమారుడు జారెడ్ గ్రోఫ్, అతడికి కాబోయే భార్య అలెక్సియా కౌయుటాస్ డువార్టే ఈ ప్రమాదంలో మరణించారు.
మరోవైపు పంజాబ్‌లో పుట్టిన సైనీ తన పేరెంట్స్‌తో కలిసి అమెరికాలో స్థిరపడింది. పిట్స్బర్గ్ యూనివర్సిటీ నుంచి వైద్య పట్టా పొందింది. అక్కడ న్యూరో సర్జన్ అయిన మైఖేల్ గ్రోఫ్తో ఆమెకు వివాహం జరిగింది. సైనీ యూరాగైనకాలజిస్ట్, ఫిమేల్ పెల్విక్ రీకన్స్ట్రక్టివ్ సర్జన్. ఆమె మరో కుమార్తె అనికా, తల్లి కుల్జీత్ సింగ్ జీవించి ఉన్నారు.