Dominican Republic | కరేబియన్ దేశంలో భారత సంతతికి చెందిన ఓ విద్యార్థిని (Indian origin student) అదృశ్యమైంది. ఫ్రెండ్స్‌తో విహారయాత్రకు వెళ్లిన ఆమె అక్కడ బీచ్‌లో గల్లంతైంది. రంగంలోకి దిగిన అధికారులు యువతి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని పిట్స్బర్గ్ యూనివర్శిటీలో (University of Pittsburgh) గ్రాడ్యుయేషన్ చదువుతున్న 20 ఏళ్ల సుదీక్ష కోనంకి (Sudiksha Konanki) గత వారం స్నేహితులతో కలిసి కరేబియన్ దేశానికి విహారయాత్రకు వెళ్లింది. డొమినికన్ రిపబ్లిక్ (Dominican Republic)లోని ప్రముఖ పర్యాటక పట్టణమైన పూంటా కానా (Punta Cana) ప్రాంతానికి వెకేషన్‌కు వెళ్లింది. అక్కడ రియూ రిపబ్లికా రిసార్ట్ (Riu Republica Hotel) వద్ద సుదీక్ష బీచ్ వెంట నడుచుకుంటూ వెళ్లింది. ఆ తర్వాత ఆమె తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన స్నేహితులు స్థానిక పోలీసులను సంప్రదించారు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే గాలింపుచర్యలు చేపట్టారు. డ్రోన్లు, హెలికాప్టర్లతో గత నాలుగు రోజులుగా ఆమె కోసం వెతుకుతున్నారు. అయితే, ఇప్పటికీ ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో విద్యార్థి బీచ్‌లో కొట్టుకుపోయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో సముద్రంలోనూ ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
కుమార్తె అదృశ్యంపై విద్యార్థి తండ్రి సుబ్బరాయుడు కోనంకి స్పందించారు. తన కుమార్తె మార్చి 6న తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో తన స్నేహితులతో కలిసి పార్టీ కోసం బీచ్‌కు వెళ్లినట్లు చెప్పారు. అయితే, కొంత సమయం తర్వాత ఆమె స్నేహితులు తిరిగి రిసార్ట్‌కు వచ్చేసినట్లు చెప్పారు. సుదీక్ష మాత్రం తిరిగి రాలేదని వివరించారు. కాగా, భారత్‌కు చెందిన సుదీక్ష తల్లిదండ్రులు అమెరికాకు వలస వెళ్లి అక్కడ శాశ్వత నివాస హోదా పొందారు. 20 ఏళ్ల నుంచి ఆ కుటుంబం వర్జీనియాలో నివాసం ఉంటోంది.
Also Read..
Lalit Modi | లలిత్ మోదీకి షాక్.. పాస్‌పోర్ట్ రద్దు చేయాలంటూ వనౌట్ ప్రధాని ఆదేశం
Mark Carney | 9 ఏండ్ల ట్రుడో పాలనకు తెర.. కెనడా నూతన ప్రధానిగా మార్క్ కార్నీ
అమెరికాలో హిందూ ఆలయంపై దాడి ఖండించిన భారత్