ఒట్టావా: కెనడాలో తొమ్మిదేండ్ల జస్టిన్ ట్రుడో (Justin Trudeau) పాలనకు తెరపడింది. ఆ దేశ నూతన ప్రధానమంత్రిగా మార్క్ కార్నీ (Mark Carney) ఎన్నికయ్యారు. జస్టిన్ ట్రుడో ప్రధాని పదవి నుంచి తప్పుకోనున్నట్లు గత జనవరిలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార లిబరల్ పార్టీ సారథి ఎన్నిక అనివార్యమైంది. ఇందులో బ్యాంక్ ఆఫ్ కెనడా మాజీ గవర్నర్ 59 ఏండ్ల మార్క్ కార్నీ విజేతగా నిలిచారు. దీంతో దేశ 24వ ప్రధానిగా పాలనా పగ్గాలు చేపట్టనున్నారు.
ప్రధాని పదవికి కార్నీతోసహా నలుగురు పోటీపడ్డారు. లక్షా 50 వేల మంది పార్టీ సభ్యులు ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఇందులో కార్నేకు 131,674 ఓట్లు వచ్చాయి. ఇవి మొత్తం ఓట్లలో 85.9తో సమానం. 11,134 ఓట్లతో క్రిస్టియా ఫ్రీలాండ్ రెండో స్థానంలో నిలిచారు. కరీనా గౌల్డ్కు 4,785 ఓట్లు, ఫ్రాంక్ బేలిస్‌కు 4,038 ఓట్లు పోలయ్యాయి. ఈ భారీ విజయంతో లిబరల్ పార్టీ నాయకత్వ బాధ్యతలను కార్నీ త్వరలో చేపట్టనున్నారు. డొనాల్డ్ ట్రంప్ నుంచి సుంకాల ముప్పు ఎదుర్కొంటున్న వేళ.. ఆర్థిక రంగంలో అపారమైన అనుభవం ఉన్న కార్నీపై కెనడా ప్రజలు భారీ ఆశలు పెట్టుకున్నారు.
కార్నీ పూర్తి పేరు మార్క్ జోసెఫ్ కార్నీ. ఆయన 1965 మార్చి 16న నార్త్‌వెస్ట్ టెరిటోరీస్లోని ఫోర్ట్ స్మిత్‌లో జన్మించారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని అందుకున్నారు. అనంతరం ఆక్స్ఫర్డ్ వర్సిటీలో మాస్టర్స్, డాక్టరేట్ డిగ్రీలను సాధించారు. 13 ఏండ్లపాటు గోల్డ్‌మన్ సాచ్స్‌లో పనిచేశారు. 2003లో బ్యాంక్ ఆఫ్ కెనడా డిప్యూటీ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. 2004లో కెనడా ఫైనాన్స్ డిపార్ట్మెంటులో సీనియర్ అసోసియేట్ డిప్యూటీ మినిస్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. అనంతరం 2008 నుంచి 2013 వరకు కెనడా బ్యాంక్ 8వ గవర్నర్‌గా సేవలందించారు. ఆ సమయంలో ఆర్థిక సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడానికి అవసరమైన చర్యలను సమన్వయపరచడంలో కీలకంగా వ్యవహరించి ప్రశంసలు అందుకున్నారు.
2013 నుంచి 2020 వరకు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ 120వ గవర్నర్‌గా పనిచేశారు. దీంతో ఆ బాధ్యతలు చేపట్టిన మొదటి బ్రిటీషేతర వ్యక్తిగా నిలిచారు. బ్రెగ్జిట్, కోవిడ్-19 మహమ్మారి సమయంలో బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను నడిపించారు. అనంతరం ఐరాస ఆర్థిక, వాతావరణ మార్పుల విభాగం రాయబారిగా సేవలందించారు.
2024లో లిబరల్ పార్టీకి ఆర్థిక సలహాదారుగా చేరారు. ట్రూడో రాజీనామా ప్రకటన అనంతరం లిబరల్స్‌లో ప్రధాని రేసులో ఉన్న నలుగురు అభ్యర్థుల్లో అత్యధిక ఆదరణ పొందారు. 86 శాతం ఓట్లతో విజయం సాధించి తదుపతి ప్రధానిగా ఎన్నికయ్యారు. కాగా, ఎన్నడూ ఎన్నికల్లో పోటీచేయని, మంత్రి మండలిలో పనిచేసిన అనుభవంలేని కార్నీ దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనుండటం గమనార్హం