Lalit Modi | ఐపీఎల్ వ్యవస్థాపకుడు, మాజీ చైర్మన్ లలిత్ మోదీ (Lalit Modi)కి షాక్ తగిలింది. ఇటీవలే ఆయన పసిఫిక్ ద్వీప దేశమైన వనౌటు (Vanuatu) పౌరసత్వం తీసుకున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, లలిత్ మోదీకి జారీ చేసిన పౌరసత్వాన్ని రద్దు చేయాలని ఆ దేశం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే లలిత్ మోదీ పాస్‌పోర్ట్‌ను రద్దు (Cancel Passport) చేయాలని పౌరసత్వ కమిషన్‌ను వనౌటు ప్రధాని జోథం నపాట్ ఆదేశించారు.
‘లలిత్ మోదీ వనౌటు పాస్‌పోర్ట్‌ను రద్దు చేయడానికి వెంటనే చర్యలు ప్రారంభించాలని పౌరసత్వ కమిషన్‌ను నేను ఆదేశించాను’ అని ప్రధాని నపట్ ఓ అధికారిక ప్రకటనలో తెలిపారు. భారత్‌కు అప్పగింత నుంచి తప్పించుకోవడానికి తమ దేశ పౌరసత్వాన్ని లలిత్ మోదీ ఉపయోగించుకుంటున్నట్టు నపట్ ఆరోపించారు.
లలిత్ మోదీ సిటిజన్‌షిప్‌ను రద్దుకు సంబంధించిన సమాచారాన్ని వనౌటు దినపత్రిక వనౌటు డైలీ వెల్లడించింది. భారత్ ఒత్తిడి వల్లే లలిత్ మోదీ పౌరసత్వాన్ని ఆ దేశం రద్దు చేసినట్లు సమాచారం. లలిత్ మోదీ పాస్‌పోర్ట్ రద్దు చేయడంలో న్యూజిలాండ్‌లోని భారత హైకమిషనర్ నీతా భూషణ్ కీలక పాత్ర పోషించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.
కాగా, ఐపీఎల్‌కు బాస్‌గా ఉన్న సమయంలో లలిత్ మోదీ కోట్లాది రూపాయలు దుర్వినియోగానికి పాల్పడ్డట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన భారత్ నుంచి పారిపోయి లండన్‌కు మకాం మార్చారు. ఈ క్రమంలో తన పాస్‌పోర్టును లండన్‌లోని భారత హైకమిషన్ కార్యాలయంలో అప్పగిస్తానని ఇటీవల దరఖాస్తు కూడా చేసుకున్నారు. దానికి ముందే సంపన్నులు తీసుకునే వనౌటు ‘గెల్డెన్ పాస్‌పోర్ట్’ కార్యక్రమం కింద పౌరసత్వం పొందినట్లు తెలిసింది. భారత్‌లో దర్యాప్తును తప్పించుకునేందుకే ఆయన వనౌటు పౌరసత్వం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read..
Victory Rally | టీమ్ఇండియా విజయోత్సవ ర్యాలీపై రాళ్లదాడి.. రెండు వర్గాల మధ్య ఘర్షణ
అమెరికాలో హిందూ ఆలయంపై దాడి ఖండించిన భారత్
Mark Carney | 9 ఏండ్ల ట్రుడో పాలనకు తెర.. కెనడా నూతన ప్రధానిగా మార్క్ కార్నీ