కాలిఫోర్నియా: అమెరికాలోని కాలిఫోర్నియాలో గల చినో హిల్స్‌లో ఉన్న బీఏపీఎస్ హిందూ దేవాలయంపై దుండగులు దాడి చేశారు. ఆలయ గోడలపై విద్వేష రాతలు రాశారు. అమెరికాలోని బీఏపీఎస్ అధికారిక పేజ్ ఈ సంఘటన వివరాలను శనివారం సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. హిందువులు విద్వేషానికి వ్యతిరేకంగా దృఢంగా నిలబడతారని స్పష్టం చేసింది.
విద్వేషం బలపడటానికి అవకాశం ఇవ్వబోమని చెప్పింది. శాంతి, కారుణ్యాలు పైచేయి సాధించేలా కృషి చేస్తామని తెలిపింది. కొద్ది రోజుల్లో లాస్ ఏంజిల్స్‌లో ఖలిస్థానీ రిఫరెండం జరగబోతున్న నేపథ్యంలో ఈ దాడి జరగడం గమనార్హం. చినో హిల్స్‌లోని హిందూ దేవాలయంపై దాడిని భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రభుత్వాధికారులను కోరింది.