Deportees | అక్రమ వలసదారులను వారి సొంత దేశాలకు పంపించే ప్రక్రియలో భాగంగా అమోరికా 300 మందిని పనామా (Panama) దేశానికి తరలించిన విషయం తెలిసిందే. అక్కడ వారందరినీ ఓ హోటల్లో నిర్బంధించినట్లు వార్తలు వస్తున్నాయి. వీరిలో భారత్ సహా పలు దేశాలకు చెందిన వారు ఉన్నారు. అయితే, ఆ హోటల్లో నిర్బంధంలో ఉన్న వలసదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఈ వార్తలపై పనామాలోని భారత రాయబార కార్యాలయం (Indian Embassy) తాజాగా స్పందించింది.
వారంతా క్షేమంగా, సురక్షితంగా ఉన్నట్లు వెల్లడించింది. ‘భారతీయుల బృందం అమెరికా నుంచి పనామాకు చేరుకుంది. ఈ విషయాన్ని పనామా అధికారులు తెలిపారు. వారంతా సురక్షితంగా, క్షేమంగా ఉన్నారు. హోటల్లో వారికి అన్ని వసతులు ఏర్పాటు చేశారు. ఎలాంటి ఇబ్బందులూ లేవు. అక్కడి అధికారులతో కలిసి పనిచేస్తున్నాం’ అని తెలిపారు.
కాగా, వలసదారులు ఆ హోటల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తమకు సాయం చేయాలని కోరుతూ హోటల్ గది నుంచి ప్లకార్డుల ద్వారా వీరు బయటి వారిని కోరుతున్నారు. వీరిలో దాదాపు 40 శాతం మంది సొంత దేశాలకు వెళ్లేందుకు ఇష్టపడటం లేదని తెలుస్తున్నది. కాగా, భారతీయ అక్రమ వలసదారులను అమెరికా నుంచి ప్రైవేటు విమానాల్లో రప్పించేందుకు విదేశాంగ శాఖ సంప్రదింపులు జరుపుతున్నది.
Also Read..
Donald Trump | భారత్లో టెస్లా ఫ్యాక్టరీ ఏర్పాటు.. మస్క్ నిర్ణయం అన్యాయమే : డొనాల్డ్ ట్రంప్
Donald Trump | భారత్లో మరెవర్నో గెలిపించేందుకే ఆ నిధులు.. గత బైడెన్ ప్రభుత్వంపై ట్రంప్ ఆరోపణలు