PM Modi : యూఏఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ శుక్రవారం అబుదాబి చేరుకున్నారు. మోదీకి యూఏఈ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఘన స్వాగతం పలికారు. యూఏఈ చేరుకున్న అనంతరం ప్రధాని మోదీ.. అక్కడి అత్యున్నత గౌరవమైన గార్డ్ ఆఫ్ ఆనర్ అందుకున్నారు. ఈ పర్యటన సందర్భంగా యూఏఈ, ఇండియా మధ్య కీలక అంశాలపై పలు ఒప్పందాలు జరగబోతున్నాయి.
వ్యూహాత్మక భాగస్వామ్యం, ఎనర్జీ, రక్షణ, పెట్టుబడులు వంటి అంశాల్ని కీలకంగా చర్చించనున్నారు. తాజా సమాచారం ప్రకారం వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యంపై, ద్వైపాక్షిక, వ్యూహాత్మక రక్షణ సహకారంపై యూఏఈ, ఇండియా మధ్య ఒప్పందం కుదిరింది. అలాగే, వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలు, ఎల్పీజీ సరఫరాపై కూడా ఎంఓయూ కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా ఇండియాకు చమురు సరఫరా పెరగనుంది. ఇరు దేశాలకు నౌకా రవాణ చాలా కీలకం. అందుకే రెండు దేశాల మధ్య నౌకల మరమ్మతుల కోసం వాడినార్లో ఒక క్లస్టర్ ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు. ఆర్బీఎల్ బ్యాంక్, సమ్మాన్ క్యాపిటల్ సహా ఇండియాలోని నిర్మాణ రంగంలో 5 బిలియన్ డాలర్లు పెట్టుబడులకు కూడా ఒప్పందం కుదిరింది.
మరోవైపు ఇటీవల యూఏఈపై ఇరాన్ దాడులు చేసిన సంగతి తెలిసిందే. పలు మిస్సైళ్లతో యూఏఈలోని చమురు క్షేత్రాలపై దాడులు చేసింది. ఈ దాడుల్ని భారత్ ఖండించింది. తాజాగా ప్రధాని మోదీ కూడా యూఏఈపై దాడుల్ని ఖండించారు. యూఏఈని లక్ష్యంగా చేసుకుని దాడి చేయడం సరికాదన్నారు. ప్రస్తుతం ప్రధాని మోదీ విదేశాల్లో పర్యటనకు వెళ్తున్నారు. ముందుగా యూఏఈలో పర్యటిస్తున్నారు. ఆ తర్వాత నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీలో పర్యటిస్తారు.