హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ) : భారత్-యూకేల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం(సీఈటీఏ)తో రాష్ట్రం గరిష్ఠ ప్రయోజనాలు పొందేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. గురువారం సచివాలయంలో యూకే డిప్యూటీ ట్రేడ్ కమిషనర్(దక్షిణాసియా) చంద్రు కే అయర్ నేతృత్వంలోని కమిటీతో ఆయన సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ ఒప్పందంతో దేశం నుంచి ఎగుమతయ్యే 99 శాతం పారిశ్రామిక ఉత్పత్తులపై యూకే సుంకాలను తొలగించడం శుభసూచికమని, దీంతో ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యం భారీగా వృద్ధి చెందుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రెండు దేశాల మధ్య రూ.32.56 లక్షల కోట్ల వాణిజ్యానికి అవకాశం ఉందన్నారు. రాష్ట్రం నుంచి యూకేకు ప్రస్తుతం రూ.3,553 కోట్ల విలువైన ఎగుమతులు జరుగుతున్నాయి.