వాషింగ్టన్, ఫిబ్రవరి 1: ఇక నుంచి ఇరాన్‌కు బదులుగా భారత్.. వెనెజువెలా నుంచి చమురును దిగుమతి చేసుకుంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం ప్రకటించారు. ఫ్లోరిడాకు ఎయిర్‌ఫోర్స్ వన్‌లో వెళుతూ ఆయన మీడియాతో మాట్లాడారు. ‘మేము ఇప్పటికే ఒక ఒప్పందం చేసుకున్నాం. అందులోకి భారత్ వచ్చింది. వారు ఇరాన్ బదులుగా వెనెజువెలా నుంచి చమురును కొనుగోలు చేయబోతున్నారు. ఈ ఒప్పందం భావనను ఇప్పటికే రూపొందించాం’ అని ఆయన పేర్కొన్నారు.
ఒకప్పుడు టెహ్రాన్ అతి పెద్ద చమురు సరఫరాదారునిగా ఉన్నప్పటికీ దీర్ఘకాలంగా కొనసాగుతున్న అమెరికా ఆంక్షల వల్ల ఇరాన్ నుంచి భారత్ స్వల్ప మొత్తంలోనే క్రూడ్‌ను దిగుమతి చేసుకుంటున్నది. అమెరికా తాజా ప్రకటనతో భారత్ మళ్లీ వెనెజువెలా నుంచి చమురు కొనుగోళ్లను పునరుద్ధరించనుంది. ప్రస్తుతం మాస్కోకు నిధులు అందకుండా చేసి ఉక్రెయిన్ యుద్ధాన్ని నిలువరించే ప్రయత్నంలో భాగంగా రష్యాకు ప్రత్యామ్నాయంగా వెనెజువెలా నుంచి వివిధ ఉత్పత్తులను భారత్ దిగుమతి చేసుకోవడాన్ని అమెరికా ప్రోత్సహిస్తున్నది.