న్యూఢిల్లీ, ఆగస్టు 8 : సుంకాలపై వివాదం పరిష్కారం అయ్యే వరకు భారత్‌తో వాణిజ్య చర్చలు జరిపే ప్రసక్తి లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. వాషింగ్టన్‌లోని తన ఓవల్ ఆఫీసులో ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ భారత్‌తో చర్చలు జరిపే అవకాశాన్ని తోసిపుచ్చారు. అదనపు సుంకాలు విధించిన తర్వాత భారత్‌తో చర్చలు జరిగే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు తమ రెండు దేశాల మధ్య సుంకాల వివాదం పరిష్కారం కానంత వరకు భారత్‌తో చర్చలు జరిపే అవకాశం లేదని చెప్పారు. రష్యా నుంచి చమురు కొనుగోలును కొనసాగిస్తున్న భారత్‌పై అదనంగా 25 శాతం ప్రతీకార సుంకాలను విధిస్తున్నట్లు ట్రంప్ బుధవారం ప్రకటించారు. దీంతో భారత్‌పై విధించిన మొత్తం సుంకం 50 శాతానికి చేరుకుంది. మొదట విధించిన 25 శాతం సుంకం ఆగస్టు 7న అమలులోకి రాగా తాజాగా విధించిన అదనపు సుంకాలు 21 రోజుల తర్వాత ఆగస్టు 27 నుంచి అమలులోకి రానున్నాయి.
రష్యా చమురు కొనుగోలు, సుంకాలు, వాణిజ్య అసమతుల్యతపై భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్న వేళ భారత్‌ను తమ వ్యూహాత్మక భాగస్వామిగా అభివర్ణించిన అమెరికా విదేశాంగ శాఖ.. భారత్‌తో పూర్తిగా, స్పష్టంగా చర్చలు కొనసాగిస్తామని ప్రకటించింది. చమురు కొనుగోలు, వాణిజ్య అసమతుల్యతపై అధ్యక్షుడు ట్రంప్ ఆందోళన చెందుతున్నప్పటికీ భారత్ మాత్రం తమకు వ్యూహాత్మక భాగస్వామేనని, ఆ దేశంతో పూర్తిస్థాయిలో, స్పష్టతతో చర్చలు కొనసాగిస్తామని అమెరికా విదేశాంగ శాఖ ప్రిన్సిపల్ డిప్యూటీ అధికార ప్రతినిధి టామీ పిగాట్ గురువారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. భారత్‌తో సంబంధాలు దిగజారడం లేదా భారత్ చైనాకు దగ్గరయ్యే అవకాశాలపై అమెరికా ఆందోళన చెందుతోందా అన్న ప్రశ్నకు తమ వ్యూహాత్మక భాగస్వామితో ప్రత్యక్ష చర్చల ద్వారా విభేదాలు పరిష్కరించుకోవడానికే అమెరికా కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. వాణిజ్య అసమతుల్యత, రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు అంశాలపైనే తమ రెండు దేశాల మధ్య విభేదాలు ఏర్పడినట్లు ఆయన వెల్లడించారు. ఆ సమస్యలను పరిష్కరించడం చాలా ముఖ్యమని, అధ్యక్షుడు ట్రంప్ కూడా ఆ విషయంలో చాలా స్పష్టంగా ఉన్నారని పిగాట్ తెలిపారు.