హైదరాబాద్, సెప్టెంబర్ 20 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): ఇండియన్ టెకీల డాలర్ డ్రీమ్స్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నీళ్లు చల్లారు. అగ్రరాజ్యంలో ఉద్యోగం చేద్దామని గంపెడాశతో ఉన్న సాంకేతిక నిపుణులపై పిడుగు వేశారు. సుంకాలు, అక్రమ వలసల పేరిట ఇప్పటికే కఠిన నిర్ణయాలను తీసుకొచ్చిన ట్రంప్.. ఇప్పుడు హెచ్-1బీ వీసాల దరఖాస్తు రుసుమును ఏకంగా లక్ష డాలర్లకు (రూ. 88 లక్షలు) పెంచారు. ఈ మేరకు కార్యనిర్వాహక ఉత్తర్వులపై శుక్రవారం సంతకాలు చేశారు. తాజా నిర్ణయం ఆదివారం అర్ధరాత్రి 12.01 గంటల నుంచి (భారత కాలమానం ప్రకారం.. ఆదివారం ఉదయం 9.30 గంటలు) అమల్లోకి వస్తుందని తెలిపారు. తాను తీసుకొన్న నిర్ణయానికి సాంకేతిక రంగం మద్దతు ఇస్తుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. అత్యంత నైపుణ్యం కలిగిన వ్యక్తులే తమ దేశానికి రావాలని, గొప్ప ఉద్యోగులనే తాము కోరుకొంటున్నామని తెలిపారు. దేశ భద్రతను దృష్టిలో పెట్టుకొనే ఈ నిర్ణయం తీసుకొన్నట్టు వెల్లడించారు. హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్ దుర్వినియోగం కాకుండా ఉండేందుకే తాను ఇలా చేసినట్టు తెలిపారు.
హెచ్-1బీ వీసా రుసుము పెంపునకు సంబంధించి ఇప్పటికే అన్ని పెద్ద కంపెనీలతో చర్చలు జరిపినట్టు అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ తెలిపారు. అమెరికన్ల ఉద్యోగాలను కొల్లగొడుతున్న విదేశీయులను ఉద్యోగాల్లోకి తీసుకోవడాన్ని నిలిపేయాలని ఈ సందర్భంగా ఆయన టెక్ కంపెనీలను కోరారు. మీరు (కంపెనీలు) ఎవరికైనా ట్రైనింగ్ ఇవ్వాలని అనుకొంటే అమెరికాలోని గొప్ప యూనివర్సిటీల్లో డిగ్రీ సాధించిన వారికే ఆ శిక్షణను ఇవ్వండి. మన ఉద్యోగాలను కొల్లగొడుతున్న ఇతర దేశీయులకు కొలువులు ఇవ్వడం ఇకనైనా ఆపండి అని ఆయన కోరారు.
అమెరికా హెచ్-1బీ వీసాదారుల్లో భారతీయుల వాటా 72 శాతంగా ఉన్నది. ట్రంప్ తాజా నిర్ణయం నేపథ్యంలో 2023 నాటి లెక్కల ప్రకారం.. దాదాపు 4 లక్షల మంది భారతీయులపై హెచ్-1బీ వీసా పెంపు ప్రభావం పడవచ్చు. ఇక మీదట అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకొనేందుకు ఒక్కొక్క వీసాపై ఏడాదికి లక్ష డాలర్లు చెల్లించాల్సి వస్తుంది. హెచ్-1బీ వీసాను సాధారణంగా మూడు నుంచి ఆరేండ్ల మధ్య కాలానికి మంజూరు చేస్తారు. దీంతో వీసా గడుపు పొడిగింపునకు కూడా ఏడాదికి లక్ష డాలర్ల రుసుమును చెల్లించాల్సి వస్తుంది. ట్రంప్ తాజా నిర్ణయంతో అమెరికాలో కొలువు చేయాలనుకొనే భారతీయ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడనున్నట్టు నిపుణులు చెప్తున్నారు.
అమెరికాలోని టెక్ కంపెనీల్లో నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణులు పనిచేయడానికి ఉద్దేశించినవే హెచ్-1బీ వీసాలు. 1990లో ఇమిగ్రేషన్ యాక్ట్, 1990 ద్వారా అప్పటి అధ్యక్షుడు జార్జ్ బుష్ దీన్ని తీసుకొచ్చారు.
హెచ్-1బీ వీసాదారుల్లో భారతీయ ఉద్యోగుల వాటా 72 శాతంగా ఉన్నది. ఏటా అమెరికా జారీ చేసే ప్రతీ పది హెచ్-1బీ వీసాల్లో ఏడుకు పైగా వీసాలు భారతీయ ఉద్యోగులకే దక్కుతున్నాయి. భారత్ తర్వాత చైనా 11.7 శాతంతో రెండో స్థానంలో ఉన్నది.
హెచ్-1బీ అడ్మినిష్ర్టేషన్ ఫీజు కింద ఇప్పటివరకూ 2వేల నుంచి 5 వేల డాలర్ల వరకు వసూలు చేసేవారు. అది ఇప్పుడు లక్ష డాలర్లకు (రూ.88 లక్షలు) చేరింది. దీంతో దరఖాస్తుదారులపై విపరీత భారం పడింది. హెచ్-1బీ వీసా రుసుము నాన్-రీఫండబుల్(వాపసు రాదు) అన్న విషయం తెలిసిందే.