న్యూయార్క్: భారత్, పాకిస్థాన్ మధ్య అణ్వాయుధ యుద్ధాన్ని ఆపినట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) తెలిపారు. ఆ రెండు దేశాల మధ్య సమరాన్ని నివారించడం వల్ల కోట్లాది మంది ప్రాణాలను కాపాడినట్లు ఆయన పేర్కొన్నారు. రెండోసారి అమెరికా దేశాధ్యక్షుడిగా ఎన్నికై ఏడాది పూర్తి అయిన సందర్భంగా వైట్‌హౌజ్‌లో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. గత ఏడాది కాలంలో తమ ప్రభుత్వం సాధించిన విజయాలను ఆయన మీడియాకు వివరించారు. ఓ దశలో తన అంచనా ప్రకారం భారత్, పాక్ అణుదాడి చేసేందుకు సిద్దమైనట్లు ట్రంప్ పేర్కొన్నారు. 10 నెలల్లోనే 8 యుద్ధాలను ఆపినట్లు ఆయన తెలిపారు. ఎన్నటికీ ముగింపులేని యుద్ధాలను నివారించానని, కంబోడియా-థాయ్‌ల్యాండ్ మధ్య ఎన్నో ఏళ్లుగా యుద్ధం జరుగుతోందని, కొసావో-సెర్బియా, కాంగో-రువాండ, ఇండియా-పాక్ మధ్య గొడవలను పరిష్కరించినట్లు ఆయన వెల్లడించారు. ఇండియా, పాక్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయని, 8 యుద్ధ విమానాలు కూలిపోయాయని, ఓ దశలో ఆ రెండు దేశాలు మధ్య అణుదాడి జరిగే పరిస్థితి ఏర్పడిందని ట్రంప్ అన్నారు.
వైట్‌హౌజ్ ప్రెస్ బ్రీఫింగ్ రూమ్‌లో సుమారు 105 నిమిషాల పాటు ట్రంప్ మీడియాతో ముచ్చటించారు. ఆ సమయంలో ఆయన పదేపదే ఇండోపాక్ యుద్ధాన్ని ఆపినట్లు పేర్కొన్నారు. కోటి మంది ప్రాణాలను మీరు కాపాడారని పాక్ ప్రధాని తనను ప్రశంసించినట్లు ట్రంప్ మరోసారి గుర్తు చేశారు. నోబెల్ ప్రైజ్ గెలిస్తే అమెరికా సగటు వ్యక్తుల జీవనం ఎలా మారేదని అడిగిన ప్రశ్నకు ట్రంప్ బదులిస్తూ.. ఇప్పటికే 8 యుద్ధాలను ఆపడం వల్ల కోట్లాది మంది ప్రాణాలను కాపాడానని చెప్పారు. ఇండియా, పాక్ మధ్య యుద్ధాన్ని ఆపడం వల్ల సుమారు 20 మిలియన్ల మంది ప్రాణాలను కాపాడినట్లు అవుతోందన్నారు. బహుశా అంతకన్నా ఎక్కువ మంది ప్రాణాలు రక్షించి ఉంటానన్నారు.
ట్రంప్ తన రెండో పర్యాయంలో సాధించిన విజయాల గురించి వైట్‌హౌజ్ ఓ ప్రకటన రిలీజ్ చేసింది. 365 రోజుల్లో 365 విజయాలు అంటూ ట్రంప్ సాధించిన ఘనతల గురించి బుక్‌ను రిలీజ్ చేశారు. ఇండియా, పాక్ మధ్య శాంతి ఒప్పందాన్ని కుదుర్చినట్లు ఆ ఘనతల్లో పేర్కొన్నారు. అయితే ఇప్పటివరకు సుమారు 90 సార్లకు పైగా ఇండోపాక్ సమరాన్ని ఆపినట్లు ట్రంప్ వెల్లడించారు. అమెరికాతో పాటు పలు దేశాల పర్యటన సమయంలో ఆయన ఈ విషయాన్ని చెబుతూనే ఉన్నారు. ఇండియా, పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్లు మే 10వ తేదీన ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే.
కానీ భారత్ మాత్రం ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నది. పాక్‌తో జరిగిన సమరంలో మూడవ దేశ పాత్ర లేదని చెబుతోంది. చాలా యుద్ధాలను ఆపానని, దానికి తనకు నోబెల్ శాంతి బహుమతి దక్కాలన్నారు. ఇజ్రాయిల్-ఇరాన్, ఈజిప్ట్-ఇథోపియా, ఆర్మేనియా-అజర్బైజాన్ మధ్య యుద్ధాలను కూడా ఆపినట్లు ఆయన చెప్పారు. ప్రతి యుద్ధానికి ఓ నోబెల్ ప్రైజ్ రావాలని, కానీ అలా అనలేనన్నారు. కోట్లాది మంది ప్రాణాలను కాపాడినట్లు తెలిపారు. ప్రతి దేశాధినేత తనకు నోబెల్ ఇవ్వాలని తన పేరును నామినేట్ చేసినట్లు ట్రంప్ గుర్తు చేశారు.
నోబెల్ బహుమతి అందజేసే నార్వేపై ట్రంప్ ఆగ్రహన్ని వ్యక్తం చేశారు. ఆ అవార్డుపై నార్వేకు పూర్తి నియంత్రణ ఉందన్నారు. నోబెల్ ప్రైజ్‌పై నార్వేకు పట్టు లేదని ఎవరూ ఊహించవద్దు అన్నారు. ఆ అవార్డును కంట్రోల్ చేసే శక్తి నార్వేకు ఉందన్నారు. 8 యుద్ధాలను ఆపానని, బహుశా ఏ దేశాధ్యక్షుడు కూడా అన్ని యుద్ధాలను సెటిల్ చేసి ఉండరన్నారు. తానేమీ నోబెల్ బహుమతి కోసం ఇవ్వన్నీ చేయలేదని, కేవలం ప్రజల ప్రాణాలను కాపాడినట్లు చెప్పారు. చివరి యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తున్నానని, రష్యా-ఉక్రెయిన్ పోరును ఆపేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. తనకు నోబెల్ ప్రైజ్ అందజేసిన వెనిజులా ప్రతిపక్ష నేత మారియా కోరినా మాచాడో మంచి వ్యక్తి అని ట్రంప్ కితాబు ఇచ్చారు.