ఢాకా: భారత్ తమకు గొప్ప మిత్ర దేశమని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా(PM Sheikh Hasina) తెలిపారు. నాలుగోసారి తమ ప్రభుత్వం విజయం సాధించిన తర్వాత ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడారు. రెండు దేశాల తమ మధ్య ఉన్న సమస్యల్ని ద్వైపాక్షికంగా పరిష్కరించుకున్నాయన్నారు. 1971, 1975లోనూ ఇండియా తమకు సపోర్టు ఇచ్చిందన్నారు.ఆ సమయంలో తనకు తన సోదరికి ఆశ్రయం ఇచ్చినట్లు ఆమె గుర్తు చేశారు. కుటుంబసభ్యుల్ని హత్య చేసిన తర్వాత ఆరేళ్లు హసీనా ఇండియాలోనే ఆశ్రయం పొందారు. 1975లో షేక్ ముజ్బీర్ రెహ్మాన్‌తో పాటు ఆయన భార్య, ఆయన ముగ్గురు కుమారుల్ని మిలిటరీ అధికారులు చంపేశారు. హసీనా, రెహానాలు విదేశాల్లో ఉన్న కారణంగా ఆ హత్యాయత్నం నుంచి తప్పించుకున్నారు. అన్ని దేశాలతోనూ తమకు మంచి సంబంధాలు ఉన్నాయని, ఎందుకంటే అదే తమ లక్ష్యమని ఆమె అన్నారు. రాబోయే అయిదేళ్లలో ఆర్థిక ప్రగతిపై దృష్టి పెట్టినట్లు ఆమె వెల్లడించారు.