న్యూఢిల్లీ, మార్చి 14: బలూచిస్తాన్ రైలు హైజాక్ ఘటన నేపథ్యంలో పాకిస్థాన్ మరోసారి భారత్‌పై నోరు పారేసుకుంది. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా భారత్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నదని, తెర వెనుకుండి ఉగ్రవాదానికి మద్దతు (స్పాన్సర్ చేస్తున్నదని) పలుకుతున్నదని గురువారం పాకిస్థాన్ ఆరోపణలకు దిగింది. పొరుగు దేశాలను భారత్ అస్థిరపరుస్తున్నదని, ప్రపంచవ్యాప్తంగా హత్యాకాండను నిర్వహిస్తున్నదని పాకిస్థాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి షౌకత్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలు భారత్‌ను తీవ్ర ఆగ్రహానికి గురిచేశాయి. తన వైఫల్యాల్ని కప్పి పుచ్చుకునేందుకు పాకిస్థాన్ ఇతర దేశాలపై నిందలను మోపుతున్నదంటూ భారత్ ఘాటుగా స్పందించింది. గ్లోబల్ టెర్రరిజానికి ముఖ్య కేంద్రం ఎక్కడుందన్నది ప్రపంచానికి అంతటికీ తెలుసునని పాక్‌ను పరోక్షంగా ఎత్తిపొడిచింది. గురువారం షౌకత్ అలీఖాన్ బలూచిస్తాన్ రైలు హైజాక్ ఘటనపై మీడియాతో మాట్లాడుతూ భారత్‌పై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ‘భారత్ ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదం బలూచిస్తాన్ రైలు హైజాక్ ఘటనతో ప్రత్యక్ష సంబంధముంది’ అని అన్నారు. దీనిపై శుక్రవారం భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ మాట్లాడుతూ, పాకిస్థాన్ చేసిన నిరాధార ఆరోపణల్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.