Karachi blast : తీవ్రవాదులకు స్వర్గధామంగా ఉన్న పాకిస్తాన్.. భారత్‌పై దుష్ప్రచారం చేస్తోంది. తాజాగా పాకిస్తాన్‌లోని కరాచీలో జరిగిన పేలుళ్లకు, ఇండియాకు సంబంధం ఉందని పాకిస్తాన్ ఆరోపించింది. ఈ ప్రచారాన్ని భారత్ ఖండించింది. పాకిస్తాన్ ఆరోపణలు నిరాధారమైనవని కొట్టిపారేసింది. కరాచీలోని సింధ్ రేంజర్ల కాంపౌండ్ లక్ష్యంగా శనివారం రాత్రి దాడి జరిగింది. ఈ ఘటనలో నలుగురు పాక్ సైనికులు మరణించారు. పాక్ సైన్యం జరిపిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదులు మరణించారు.
అయితే, ఈ ఘటనకు భారత్‌కు సంబంధం ఉందని పాకిస్తాన్ ఆరోపించింది. ఈ ఆరోపణలపై భారత విదేశీ వ్యవహారాల శాఖ ఘాటుగా స్పందించింది. ఈ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ దీనిపై ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘కరాచీ దాడులకు సంబంధించి భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవి. ఈ ఆరోపణల్ని భారత్ ఖండిస్తోంది. ఇతరుల్ని వేలెత్తి చూపే ముందు పాకిస్తాన్ తన దేశంలోని ఉగ్రవాదులపై దృష్టి సారించాలి. స్వదేశంలో ఉన్న ఉగ్రస్థావరాలపై పాక్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. ఉగ్రవాదంపై ఆధారపడే విధానాన్ని పాక్ విడిచిపెట్టాలి’’ అంటూ ప్రకటన విడుదల చేసింది. తమ దేశంలోని భద్రతా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే పాక్ ఇలాంటి ఆరోపణలు చేస్తోందని విమర్శించింది. దీని ద్వారా పాకిస్తాన్ ఉగ్రవాదులకు నిలయంగా మారిందని, అక్కడే ఉగ్ర స్థావరాలున్నాయని భారత్ పరోక్షంగా స్పష్టం చేసింది.
కరాచీ పేలుళ్ల అంశంలో ఇండియాపై పాక్ ఆరోపణలు చేస్తే.. ఈ దాడికి తామే బాధ్యులమని జమాత్-ఉల్-అహ్రర్ సంస్థ ప్రకటించుకుంది. ఇది నిషేధిత తెహ్రీక్ ఇ తాలిన్ పాకిస్తాన్ (టీటీపీ) అనే పాక్ ఉగ్రసంస్థ నుంచి విడిపోయిన సంస్థ. గతంలో కూడా ఈ సంస్త పాక్‌లోని ప్రభుత్వ కార్యాలయాలు, సైనికులు లక్ష్యంగా దాడి చేసింది. 202ల4 తొలిసారిగా కరాచీలో చైనా ఇంజినీర్లపై ఈ సంస్థ ఉగ్రదాడి చేసింది. ఈ ఘటనలో ఇద్దరు చైనీయులు మరణించారు.