BRS Rythu Sadassu | లక్షెట్టిపేట/మంచిర్యాలటౌన్, జూలై 20 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు మంగళవారం మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటకు రానున్నారు. ఉదయం 11 గంటలకు లక్షెట్టిపేటలోని కరీంనగర్ చౌరస్తాకు చేరుకుంటారు. అక్కడి నుంచి ర్యాలీగా లక్షెట్టిపేట సమీపంలోని అంకతిపల్లిలోని వాసవీ ఫంక్షన్హాలుకు చేరుకుని రైతు సదస్సులో పాల్గొంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రైతులు పడుతున్న ఇబ్బందులు, వైఫల్యాలను వివరించడంతో పాటు బీఆర్ఎస్ హయాంలో రైతు సంక్షేమానికి, అభివృద్ధికి చేసిన పనులను వివరించనున్నారు. మే 6న లక్షెట్టిపేట మండలంలో పంటలు కాపాడుకునేందుకు వెళ్లి మృత్యువాత పడిన నలుగురు రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ. 5 లక్షల చొప్పున మొత్తం రూ. 20 లక్షల ఆర్థికసాయాన్ని అందించనున్నారు.
రైతు సదస్సుకు మూడు వేల మంది రైతులు హాజరయ్యే విధంగా బీఆర్ఎస్ నాయకులు సన్నాహాలు చేస్తున్నారు. మాజీ మంత్రులు జీవన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్, మాజీ ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్‌రావు, చిన్నయ్యతో పాటు టీబీజీకేఎస్ నాయకులు, ఉమ్మడి జిల్లాకు చెందిన ముఖ్య నాయకులు హాజరవుతున్నారు. సోమవారం అంకతిపల్లె గ్రామ వాసవీ ఫంక్షన్ హాల్లోని ఏర్పాట్లను బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల సుమన్, మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు విజిత్‌రావు పరిశీలించారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు అత్యధిక సంఖ్యలో పాల్గొని సదస్సును జయప్రదం చేయాలని వారు కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ నల్మస్ కాంతయ్య, మాజీ వైస్ చైర్మన్ పొడేటి శ్రీనివాస్ గౌడ్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ తిప్పని లింగన్న, కేతిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కౌన్సిలర్ పెట్టం తిరుపతి, మెట్టు రాజు పాల్గొన్నారు.