Ceasefire | భారత్-పాక్ (India-Pak) ఉద్రిక్తతలను తగ్గించడానికి తదుపరి చర్చలు కొనసాగించాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్‌ల సమావేశంలో నిర్ణయించినట్లు తెలిసింది. మే 10వ తేదీన ఇరు దేశాల డీజీఎంవోల (DGMOs) మధ్య కుదిరిన ఒప్పందం మేరకు సరిహద్దుల్లో కాల్పుల విరమణ (Ceasefire) అమలవుతోంది. తాజాగా, ఈ ఒప్పందాన్ని మరింత కాలం కొనసాగించాలని నిర్ణయించినట్లు అధికార వర్గాలు నిన్న వెల్లడించాయి. అయితే, అది ఎప్పటి వరకూ అన్నది మాత్రం తెలపలేదు.
ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం మే 18వ తేదీ వరకు మాత్రమే వర్తిస్తుందని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ (Ishaq Dar) తాజాగా వెల్లడించారు. ‘ఇరు దేశాల డీజీఎంవోల మధ్య గత బుధవారం హాట్‌లైన్ ద్వారా చర్చలు జరిగాయి. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం మే 18వరకు మాత్రమే వర్తిస్తుంది. అదే రోజు రెండు దేశాల మధ్య మరోసారి చర్చలు జరుగుతాయి’ అని తెలిపారు.
శాంతి కోసం భారత్‌తో చర్చలకు సిద్ధం : పాక్
పాకిస్థాన్ తాజాగా కీలక ప్రకటన చేసింది. భారత్‌తో శాంతి చర్చలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) ప్రకటించారు. ఆ దేశంలోని పంజాబ్ ప్రావిన్సులో ఉన్న కమ్రా ఎయిర్ బేస్‌ను విజిట్ చేసిన తర్వాత ఆయన మాట్లాడారు. అక్కడ ఉన్న సైనికులు, మిలిటరీ ఆఫీసర్లను కలిశారు. శాంతి స్థాపన కోసం పాకిస్థాన్ సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. అయితే శాంతి చర్చల కోసం కశ్మీర్ సమస్యను షరుతుగా పెట్టారాయన.
పాక్‌తో సంబంధాలు ద్వైపాక్షికమే: జైశంకర్
పాకిస్థాన్‌తో భారత్ సంబంధాలు, వ్యవహారాలు కచ్చితంగా ద్వైపాక్షికంగానే ఉంటాయని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు. చాలాకాలంగా జాతీయ ఏకాభిప్రాయం మేరకు ఇదే విధానం కొనసాగుతున్నదని, ఇందులో ఎలాంటి మార్పు లేదని ఆయన చెప్పారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కశ్మీర్ విషయానికి వస్తే చర్చించాల్సిన ఏకైక విషయం పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో చట్టవిరుద్ధంగా ఆక్రమించిన భారత భూభాగాన్ని వదిలిపెట్టడమేనని అన్నారు.
Also Read..
Shehbaz Sharif: శాంతి కోసం భారత్‌తో చర్చలకు సిద్ధం : పాకిస్థాన్ ప్రధాని
Jaishankar | పీవోకేపైనే పాక్‌తో చర్చలు.. ఉగ్రవాదం అంతమయ్యే వరకు సింధూ ఒప్పందం నిలిపివేత: జైశంకర్