న్యూఢిల్లీ: సీమాంతర ఉగ్రవాదాన్ని పాకిస్థాన్ అంతం చేసే వరకు సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తామని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ (Jaishankar) స్పష్టం చేశారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) పైనే ఆ దేశంతో చర్చలు జరుపుతామని అన్నారు. కాల్పుల విరమణ నేపథ్యంలో సింధూ జలాల ఒప్పందం నిలిపివేతను భారత్ పునఃపరిశీలించాలని పాకిస్థాన్ కోరింది. పాక్ జలవనరుల మంత్రిత్వ శాఖ ఈ మేరకు భారత విదేశాంగ శాఖకు లేఖ రాసింది.
కాగా, కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్ గురువారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పాక్ వినతిపై ఆయన స్పందించారు. ‘సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేశాం. విశ్వసనీయంగా, తిరిగి మార్చలేని విధంగా సరిహద్దు ఉగ్రవాదాన్ని పాకిస్థాన్ ఆపే వరకు ఈ ఒప్పందం నిలిపివేత కొనసాగుతుంది’ అని తెలిపారు.
మరోవైపు పాకిస్థాన్‌తో చర్చించాల్సిన ఏకైక అంశం కశ్మీర్‌పైనే అని కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు. ‘పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో చట్టవిరుద్ధంగా ఆక్రమించిన భారత భూభాగాన్ని ఖాళీ చేయాలి. ఆ చర్చకు మేం సిద్ధంగా ఉన్నాం’ అని అన్నారు.