Turkish Aviation | ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌కు తుర్కియే మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. మద్దతు ఇవ్వడంతోపాటు డ్రోన్లు, ఆయుధాలు సరఫరా చేసింది. దీంతో తుర్కియేపై భారత ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికే ఆ దేశానికి చెందిన వస్తువులను నిషేధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నెట్టింట ‘బాయ్‌కాట్ తుర్కియే’ ట్రెండ్ అవుతోంది. మరోవైపు తుర్కియేపై భారత్ కఠిన చర్యలు చేపడుతున్నది. దేశంలోని పలు విమానాశ్రయాల్లో గ్రౌండ్ హ్యాండ్లింగ్ సేవలు అందించే తుర్కియే సంస్థ (Turkish Aviation) సెలెబి ఏవియేషన్ (Celebi Aviation) సెక్యూరిటీ క్లియరెన్స్‌ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం నిర్ణయంపై సెలెబి సంస్థ తాజాగా స్పందించింది.
తమది తుర్కియేకి చెందిన సంస్థ కాదని స్పష్టం చేసింది. అంతేకాదు, ఆ దేశాధ్యక్షుడు ఎర్డోగాన్ (Erdogan) కుటుంబంతో తమకు ఎలాంటి సంబంధం లేదని, ఆయన కుమార్తె తమకు బాస్ కాదని వివరణ ఇచ్చింది. సెలెబి సంస్థను ఎర్డోగాన్ కుమార్తె సుమేయే నియంత్రిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని తెలిపింది. అంతేకాదు తమ మాతృ సంస్థలో సుమేయే పేరుతో ఎవరికీ వాటాలు గానీ, యాజమాన్య హక్కులు గానీ లేవని స్పష్టం చేసింది. కంపెనీ యాజమాన్యం హక్కులన్నీ సెలెబియోగ్లు కుటుంబ సభ్యులైన కెన్ సెలెబియోగ్లు, కెనన్ సెలెబియోగ్లులకు మాత్రమే పరిమితం అని వెల్లడించింది. వీరికి ఎలాంటి రాజకీయ అనుబంధం లేదని తెలిపింది. తమ మాతృ సంస్థలో 65శాతం వాటాలు కెనడా, యూఎస్, యూకే, సింగపూర్, యూఏఈ, పశ్చిమ ఐరోపా దేశాలకు చెందిన సంస్థాగత మదుపరులవేనని కంపెనీ స్పష్టం చేసింది. ఈ మేరకు సెలెబి సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది.
కాగా, తుర్కియేకి చెందిన సెలెబి ఎయిర్పోర్ట్ సర్వీసెస్ సంస్థకు గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఏజెన్సీ కేటగిరీ కింద 2022 నవంబర్ 21 అనుమతి లభించింది. ఢిల్లీ, ముంబై, చెన్నైతో సహా తొమ్మిది ప్రధాన విమానాశ్రయాలలో కీలకమైన హై సెక్యూరిటీ కార్యకలాపాలకు సెలెబి ఏవియేషన్ బాధ్యత వహిస్తున్నది. గ్రౌండ్ హ్యాండ్లింగ్, కార్గో సర్వీసెస్, ఎయిర్‌సైడ్ ఆపరేషన్స్ వంటి కీలక విధులను ఈ కంపెనీ నిర్వహిస్తున్నది. ఈ కార్యకలాపాలన్నీ జాతీయ భద్రతతో ముడిపడి ఉన్నాయి. ఈ నేపథ్యంలో తుర్కియేకి చెందిన సెలెబి ఎయిర్పోర్ట్ సర్వీసెస్ సంస్థ సెక్యూరిటీ క్లియరెన్స్‌ను భారత్ రద్దు చేసింది. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. జాతీయ భద్రత దృష్ట్యా, సెలెబి ఎయిర్పోర్ట్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ భద్రతా అనుమతిని రద్దు చేసినట్లు అందులో పేర్కొంది.
Also Read..
Jaishankar | పీవోకేపైనే పాక్‌తో చర్చలు.. ఉగ్రవాదం అంతమయ్యే వరకు సింధూ ఒప్పందం నిలిపివేత: జైశంకర్
Shehbaz Sharif: శాంతి కోసం భారత్‌తో చర్చలకు సిద్ధం : పాకిస్థాన్ ప్రధాని