న్యూఢిల్లీ: పాకిస్థాన్‌కు మద్దతు ఇవ్వడంతోపాటు డ్రోన్లు, ఆయుధాలు సరఫరా చేసిన టర్కీపై భారత్ కఠిన చర్యలు చేపడుతున్నది. దేశంలోని పలు విమానాశ్రయాల్లో గ్రౌండ్ హ్యాండ్లింగ్ సేవలు అందించే టర్కీ సంస్థ సెలెబి ఏవియేషన్ సెక్యూరిటీ క్లియరెన్స్‌ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. (Turkey aviation firm clearance revoked) బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. జాతీయ భద్రత దృష్ట్యా, సెలెబి ఎయిర్పోర్ట్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ భద్రతా అనుమతిని రద్దు చేసినట్లు అందులో పేర్కొంది.
కాగా, టర్కీకి చెందిన సెలెబి ఎయిర్పోర్ట్ సర్వీసెస్ సంస్థకు గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఏజెన్సీ కేటగిరీ కింద 2022 నవంబర్ 21 అనుమతి లభించింది. ఢిల్లీ, ముంబై, చెన్నైతో సహా తొమ్మిది ప్రధాన విమానాశ్రయాలలో కీలకమైన హై సెక్యూరిటీ కార్యకలాపాలకు సెలెబి ఏవియేషన్ బాధ్యత వహిస్తున్నది. గ్రౌండ్ హ్యాండ్లింగ్, కార్గో సర్వీసెస్, ఎయిర్‌సైడ్ ఆపరేషన్స్ వంటి కీలక విధులను ఈ కంపెనీ నిర్వహిస్తున్నది. ఈ కార్యకలాపాలన్నీ జాతీయ భద్రతతో ముడిపడి ఉన్నాయి. ఈ నేపథ్యంలో టర్కీకి చెందిన సెలెబి ఎయిర్పోర్ట్ సర్వీసెస్ సంస్థ సెక్యూరిటీ క్లియరెన్స్‌ను భారత్ రద్దు చేసింది.