కొలంబో : ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో దారుణ పరిస్ధితులు నెలకొన్నాయి. మందులు, ఆహారం కోసం మహిళలు వేశ్యలుగా మారుతున్న దృశ్యాలు గుండెల్ని పిండేస్తున్నాయి. ఆకలి బాధ నుంచి పిల్లల్ని కాపాడుకునేందుకు మరో గత్యంతరం లేక మహిళలు శరీరాన్ని అమ్ముకుంటున్నారు. టెక్స్టైల్ పరిశ్రమలో పనిచేసే మహిళలు తమ ఉద్యోగాలు కోల్పోవడంతో వేరే దారిలేక సెక్స్ వర్కర్లుగా మారుతున్నారు.
టెక్స్టైల్ కంపెనీల్లో గతంలో నెలకు 28,000 రూపాయలు ఆపై ఓవర్టైం పనిచేస్తే రూ 35,000 వరకూ వచ్చేవని, ఆర్ధిక సంక్షోభంతో ఉద్యోగాలు కోల్పోయి వీధినపడ్డామని, వ్యభిచార వృత్తిలో తాము ఇప్పుడు రోజుకు రూ 15,000 సంపాదిస్తన్నామని ఓ మహిళ చెప్పుకొచ్చారు. ఈ ఏడాది జనవరి నుంచి శ్రీలంక రాజధాని కొలంబోలో సెక్స్ వర్కర్ల సంఖ్య ఏకంగా 30 శాతం పెరగడం అక్కడి సంక్షోభ తీవ్రతను వెల్లడిస్తోంది.
ద్రవ్యోల్బణం ఎగబాకడంతో టెక్స్టైల్ పరిశ్రమలో వేతనాలు తగ్గించడం, ఉద్యోగుల తొలగింపుతో పాటు ఇంధనం, ఆహారం, మందుల కొరతతో కొందరు మహిళలు వ్యభిచార వృత్తిలోకి దిగుతున్నారు. నిత్యావసరాల కొరతతో మహిళలు విధిలేని పరిస్ధితుల్లో స్ధానిక దుకాణాదారులకు శరీరాలను అప్పగించి మందులు, ఆహారం కొనుగోలు చేస్తున్నారు. లంక నగరాల్లో తాత్కాలిక శిబిరాల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. పిల్లలు, వృద్ధ తల్లితండ్రులతో పాటు అక్కాచెల్లెండ్లను పోషించేందుకు.. క్విక్ మనీ కోసం ఎక్కువమంది సెక్స్ వర్కర్లుగా మారుతున్నారని లంక మహిళా హక్కుల సంస్ధ స్టాండప్ మూవ్మెంట్ లంక (ఎస్యూఎంఎల్) తెలిపింది.