మాస్కో : రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్‌ను క్యాన్సర్ వేగంగా కబళిస్తోందని, ఆయన మరో మూడేండ్లు మాత్రమే బతుకుతారని రష్యన్ ఇంటెలిజెన్స్ అధికారి వెల్లడించారు. 69 ఏండ్ల పుతిన్ తలనొప్పితో బాధపడుతూ కంటిచూపును కోల్పోతున్నారని ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ (ఎఫ్ఎస్బి) అధికారి పేర్కొన్నారు. ప్రస్తుతం బ్రిటన్‌లో ఉంటున్న మాజీ రష్యన్ గూఢచారి బొరిస్ కర్పిచ్కోవ్కు క్షీణిస్తున్న పుతిన్ ఆరోగ్య పరిస్ధితి గురించి ఎఫ్ఎస్బీ అధికారి నివేదించారని ది ఇండిపెండెంట్ తెలిపింది.
పుతిన్ తలనొప్పితో బాధపడుతున్నారని, ఆయన టీవీలో కనిపించే ప్రతిసారీ తాను చెప్పే మాటలను పెద్ద అక్షరాలతో లెటర్‌పై రాసి ఉంచేవారమని రష్యన్ అధికారి పేర్కొన్నారు. ఒక్క పేజీకి ఒకటి రెండు లైన్లు మాత్రమే రాసి ఉంటాయని, పుతిన్ కంటిచూపు తీవ్రంగా మందగిస్తోందని చెప్పారు. ఇక పుతిన్‌కు సర్జరీ చేయాల్సి ఉంటుందని ఆ సమయంలో తన బాధ్యతలను తాత్కాలికంగా ఆయన తన సహచరుడికి అప్పగించాలని పుతిన్ వైద్యులు సూచించారని అధికారి చెప్పుకొచ్చారు.
వైద్య చికిత్సల కోసం పుతిన్ సమావేశాలను వాయిదా వేసి వెళుతుండేవారనని బ్రిటన్ ఇంటెలిజెన్స్ మాజీ అధికారి పేర్కొన్న క్రమంలో పుతిన్ ఆరోగ్య పరిస్ధితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. పుతిన్ ఆరోగ్యం క్షీణిస్తోందనే వార్తలను రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ తోసిపుచ్చారు. మరోవైపు ఉక్రెయిన్‌పై మాస్కో దాడులు కొనసాగుతుండటంతో రష్యా-ఉక్రెయిన్ వార్ నాలుగో నెలలో అడుగుపెట్టింది.