లండన్ : ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించిన రష్యాపై అమెరికా, యూరప్ సహా పలు దేశాలు భగ్గుమంటున్నాయి. పుతిన్‌ను హిట్లర్, హంతకుడితో పోలుస్తూ తక్షణమే యుద్ధాన్ని విరమించాలని డిమాండ్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. ఇక రష్యా దమనకాండపై మండిపడుతున్న అమెరికా, ఐరోపా యూనియన్లు రష్యాపై ఆంక్షలు తీవ్రతరం చేశాయి.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్, విదేశాంగ మంత్రి లావ్రోవ్ ఐరోపా యూనియన్ (ఈయూ) ఆస్తులను ఫ్రీజ్ చేసేందుకు ఈయూ సన్నద్ధమైంది. ఉక్రెయిన్‌పై మాస్కో అణిచివేతకు నిరసనగా ఈయూ ఈ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. మరోవైపు రష్యా ఎయిర్‌లైన్స్‌పై ఈయూ నిషేధం విధించింది. ఆ దేశం నుంచి హైటెక్ రిఫైనరీ ఉత్పత్తుల సరఫరాను నిలిపివేసింది.
యూకే బ్యాంకుల్లో రష్యన్ల డిపాజిట్లకు పరిమితులు విధించింది. రష్యాతో వాణిజ్య బంధాలపై పునరాలోచన చేస్తామని అమెరికా, యూరప్ ప్రకటించాయి. మరోవైపు ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతుండగా ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధమేనని పుతిన్ పేర్కొన్నారు. ఉక్రెయిన్‌తో సంప్రదింపుల కోసం అక్కడకు తమ ప్రతినిధి బృందాన్ని పంపేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. అంతకుముందు పుతిన్ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మాట్లాడుతూ ఉక్రెయిన్‌తో అత్యున్నత స్ధాయి చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని పునరుద్ఘాటించారు.