Imran Khan | జైలు శిక్ష అనుభవిస్తున్న తెహ్రీక్-ఈ -ఇన్సాఫ్ (PTI) చీఫ్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan)కు పాకిస్థాన్‌లోని షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇమ్రాన్ పార్టీ పీటీఐని నిషేధించాలని నిర్ణయించింది (PTI party to be banned). ఈ మేరకు ఆ దేశ సమాచార, ప్రసార మంత్రి అత్తావుల్లా తరార్ (Pakistan Minister) సోమవారం ప్రకటించారు.
దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై పీటీఐని నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించినట్లు పాక్ మీడియా పేర్కొంది. పీటీఐని నిషేధించడానికి విదేశీ నిధుల కేసు, మే 9 అల్లర్లు, సైఫర్ ఎపిసోడ్ సహా పలు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని తాము విశ్వసిస్తున్నట్లు మంత్రి తెలిపారు. కాగా, రిజర్వ్డ్ సీట్ల విషయంలో పీటీఐకి, అక్రమ వివాహం కేసులో ఇమ్రాన్ ఖాన్‌కి ఇటీవలే సుప్రీంకోర్టులో ఉపశమనం కలిగిన విషయం తెలిసిందే. సుప్రీం తీర్పు వెలువడిన రెండు రోజులకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
మహిళలు, మైనారిటీలకు రిజర్వు చేసిన సీట్లను కేటాయించేందుకు ఆ పార్టీకి అర్హత ఉందని ఆ దేశ సుప్రీం కోర్టు రెండు రోజుల క్రితం (శుక్రవారం) కీలక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. సుప్రీం తీర్పుతో జాతీయ అసెంబ్లీలో 23 రిజర్వ్డ్ స్థానాలను పీటీఐ దక్కించుకుంది. తద్వారా పార్టీ సీట్లు 86 నుంచి 109కి పెరిగాయి. దీంతో పీటీఐ ఆ దేశంలో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా అవతరించింది.
71 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్ 1996లో పీటీఐని స్థాపించారు. 2018లో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. అవిశ్వాస తీర్మానం ఓడిపోవడంతో ఏప్రిల్ 2022లో ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత మాజీ ప్రధానికి పలు కేసుల్లో జైలు శిక్ష ఖరారు కావడంతో.. ప్రస్తుతం రావల్పిండిలోని అడియాలా జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు.
Also Read..
Ponnam Prabhakar | భవిష్యత్ తరాలు ఆరోగ్యంగా ఉండాలంటే మొక్కలు నాటాలి : మంత్రి పొన్నం ప్రభాకర్
Kedarnath: కేదార్‌నాథ్‌లో 228 కిలోల బంగారం మిస్సింగ్..
Rakul Preeth Singh | డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు.?