ఇస్లామాబాద్ : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విషయంలో భారత్ బాటలో పాకిస్తాన్ తటస్ధంగా వ్యవహరించిందని పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. ఉక్రెయిన్పై రష్యా దమనకాండను ఖండించాలని మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బజ్వా సూచించినా భారత్ వైఖరిని ప్రస్తావిస్తూ తాను అలా చేయలేదని చెప్పుకొచ్చారు.
తాను రష్యా పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత ఉక్రెయిన్పై రష్యా దాడిని ఖండించాలని జనరల్ బజ్వా కోరగా అమెరికా వ్యూహాత్మక భాగస్వామి భారత్ ఈ విషయంలో తటస్ధంగా ఉన్న విషయాన్ని తాను గుర్తుచేస్తూ పాకిస్తాన్ కూడా తటస్ధంగా ఉండాలని చెప్పానని తెలిపారు.
రష్యాపై తాను నోరు మెదపకపోవడంతో ఓ సెక్యూరిటీ సెమినార్లో అమెరికాను ప్రసన్నం చేసుకునేందుకు స్వయంగా జనరల్ బజ్వా రష్యా దాడిని ఖండించారని చెప్పారు. అమెరికాను ప్రసన్నం చేసుకునేందుకు జనరల్ బజ్వా తనను రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ దాడిని ఖండించాలని కోరగా, తాను పాకిస్తాన్ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చేందుకు మొగ్గుచూపానని ఇమ్రాన్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ గుర్తుచేసుకున్నారు.