Sheikh Hasina | బంగ్లాదేశ్ (Bangladesh)లో మహమ్మద్ యూనస్ (Muhammad Yunus) నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వంపై ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బంగ్లాదేశ్ ఘన చరిత్రను యూనస్ ప్రభుత్వం చెరిపేస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. బంగ్లాలోని తన మద్దతుదారులను ఉద్దేశించి హసీనా వర్చువల్‌గా మాట్లాడారు. ఈ సందర్భంగా యూనస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. యూనస్‌ను ‘స్వార్థపరుడైన వడ్డీ వ్యాపారి’గా అభివర్ణించారు. విదేశీ శక్తులతో కలిసి దేశాన్ని నాశనం చేయాలనే కుట్ర చేశాడని ఆమె ఆరోపించారు.
బంగ్లాదేశ్ స్వాతంత్య్ర ఉద్యమానికి సంబంధించిన అన్ని గుర్తులను చెరిపివేస్తున్నారని మండిపడ్డారు. స్వాతంత్ర్య సమరయోధులను (Mukti Joddhas) అవమానిస్తున్నారన్నారు. వారికి గుర్తుగా అన్ని జిల్లాల్లో నిర్మించిన భవనాలను తగలబెడుతున్నారని ఆరోపించారు. ‘నాటి అమరుల త్యాగాలను నేటి తరానికి చాటిచెప్పేందుకు జిల్లా కేంద్రాల్లో మా ప్రభుత్వం ‘ముక్తి జోధా కాంప్లెక్స్’లను నిర్మించింది. అయితే, ప్రస్తుతం అధికారంలో ఉన్న తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ యూనస్ మాత్రం ఆ జ్ఞాపకాలను తుడిచివేస్తున్నారు. అల్లరి మూకలను రెచ్చగొట్టి ముక్తి జోధా కాంప్లెక్స్‌లను నాశనం చేయిస్తున్నారు. అన్ని జిల్లాల్లో నిర్మించిన భవనాలను తగలబెడుతున్నారు. దీన్ని సమర్థించే ధైర్యం యూనస్‌కు ఉందా?’ అని హసీనా వ్యాఖ్యానించారు. నిప్పుతో చెలగాటమాడితే అది మిమ్మల్ని దహించివేస్తుంది అంటూ యూనస్‌ను హెచ్చరించారు.
Also Read..
Mehul Choksi | దోచుకున్న సొమ్మును తిరిగి ఇవ్వాల్సిందే.. మెహుల్ చోక్సీ అరెస్ట్‌పై కేంద్రం
Salman Khan | ఇంట్లోనే చంపుతాం.. సల్మాన్‌కు మరోసారి హత్య బెదిరింపులు