ఖియాం: ఇజ్రాయిల్ దళాలు(IDF) ఇవాళ భీకర దాడికి దిగాయి. లెబనాన్‌పై రాకెట్ల వర్షం కురిపించాయి. దీంతో అనేక బోర్డర్ పట్టణాల్లో.. పొగ కమ్ముకున్నది. హిజ్బొల్లాకు చెందిన 150 టార్గెట్లపై అటాక్ చేసిన ఇజ్రాయిల్ రక్షణ శాఖ తెలిపింది. దక్షిణ లెబనాన్‌లో ఉన్న మారజయౌన్ పట్టణ సమీపంలో వైమానిక దాడి జరిగింది. వైమానిక దళానికి చెందిన ఫైటర్ జెట్స్.. దాడుల్లో పాల్గొన్నట్లు మిలిటరీ వెల్లడించింది. భారీగా రాకెట్ దాడులకు హిజ్బొల్లా ప్లాన్ వేసినట్లు తెలియడంతో ముందే అటాక్ చేసినట్లు ఐడీఎఫ్ తెలిపింది. దాడుల నేపథ్యంలో ఇండ్లను విడిచి వెళ్లాలని లెబనీస్ ప్రజలను ఐడీఎఫ్ కోరింది. హిజ్బొల్లా మిలిటెంట్ సంస్థ.. కొన్ని ఇండ్లను ఆయుధ క్షేత్రాలుగా వాడుతోందని, వాటిపై అటాక్ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ ఇండ్ల నుంచి వెళ్లిపోవాలని ఆదేశించింది. దాడులు, ప్రతిదాడుల నేపథ్యంలో.. లెబనీస్ బోర్డర్ సమీపంలో అలర్ట్ సైరన్లు మోగుతున్నాయి.