Operation Sindoor | పారిస్, జూలై 8: ఇటీవల పాకిస్థాన్‌పై చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పోరులో భారత్ వైపు కూడా నష్టం జరిగిందా? అంటే అవునే అంటున్నారు ఫ్రాన్స్ వైమానిక దళాధిపతి జనరల్ జెరోమ్ బెల్లాంగర్. ఆ యుద్ధంలో భారత్‌కు చెందిన ఓ మిరాజ్ 2000, ఓ సుఖోయ్, మరో రాఫెల్ విమానం కూలినట్టు తాను ఆధారాలను చూశానని వెల్లడించారు. ఆపరేషన్ సిందూర్‌లో తాము కూడా భారత్‌కు భారీగా నష్టం కలిగించామని పాకిస్థాన్ అప్పటినుంచీ చెప్పుకుంటున్నది. గత మే నెల 7న భారత్‌తో ప్రారంభమైన సాయుధ ఘర్షణలో మూడు యుద్ధ విమానాలను కూల్చినట్టు ప్రకటించింది. అయితే ఇందుకు తగిన ఆధారాలను పాక్ చూపించలేకపోయింది. పాక్ ప్రకటనను చైనా కూడా ధ్రువీకరించడం కలకలం సృష్టించింది. రాఫెల్ యుద్ధ విమానం కూలిందన్న వార్తపై స్పందించిన ఫ్రెంచ్ అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. రాఫెల్ యుద్ధ విమానాలను భారత్ సహా ఎనిమిది దేశాలకు ఫ్రాన్స్ విక్రయించింది. దీంతో రాఫెల్ సామర్థ్యంపై అనుమానాలు వెల్లువెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో ఫ్రాన్స్ దర్యాప్తు చేపట్టింది.
రాఫెల్ విమానం 12 వేల మీటర్ల ఎత్తుకు ఎగరడం వల్లనే సాంకేతిక లోపం ఏర్పడి నేల కూలి ఉందని ఆ విమానాలను తయారుచేసిన డస్సాల్ట్ ఏవియేషన్ సంస్థ చైర్మన్ ఎరిక్ ట్రాపియర్ పేర్కొన్నారు. అయితే అది కూలింది యుద్ధ సమయంలో కాదని, శిక్షణ సమయంలోనని వెల్లడించారు. కానీ తాజాగా ఫ్రాన్స్ దేశానికే చెందిన వైమానిక దళ కమాండర్ వ్యాఖ్యలు అందుకు విరుద్ధంగా ఉండటం కలకలం రేపింది. ఫ్రాన్స్ ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన ఓ ఉన్నతాధికారి సైతం రాఫెల్ కూలిన విషయాన్ని సీఎన్ఎన్ వార్తా సంస్థకు వెల్లడించారు. భారత వైమానిక దళం మాత్రం ఇంతవరకు మన దేశానికి ఎంత నష్టం జరిగిందన్నది వెల్లడించలేదు. భారత వైమానిక దళానికి నష్టం జరిగిందన్న వార్తలపై కెప్టెన్ శివకుమార్ స్పందిస్తూ.. భారత్ పలు యుద్ధ విమానాలను కోల్పోయిందన్నది అవాస్తవమని అన్నారు. అయితే కొంత నష్టం జరిగిన మాట నిజమేనని అన్నారు.