Gaza | యుద్ధంతో తల్లడిల్లుతున్న గాజా (Gaza)లో తీవ్ర దుర్భిక్ష (Gaza Starvation) పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ ఆకలి కేకలు రోజురోజుకూ మిన్నంటుతున్నాయి. సంపూర్ణంగా గాజా మొత్తం కరవు పరిస్థితి ఏర్పడింది. ఆహారం దొరక్క గాజా వాసులు ఆకలితో అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో ఆకలి కేకలకు ప్రజలు పిట్టల్లా రాలుతున్నారు. గత 24 గంటల్లో తీవ్రమైన కరవు, సోషకాహార లోపం కారణంగా మరో నాలుగు మరణాలు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకూ ఆకలితో మరణించిన (Hunger related deaths) వారి సంఖ్య 197కి చేరినట్లు గాజా మంత్రిత్వ శాఖ తాజాగా తెలిపింది. ఇందులో 96 మంది చిన్నారులే కావడం కలచివేస్తోంది.
హమాస్‌ను శిక్షించే పేరుతో గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం మొదలుపెట్టి 22 నెలలు కావస్తున్నది. ఆ లక్ష్యం ఎప్పుడు నెరవేరుతుందో తెలియదు గానీ 20 లక్షల మంది గాజావాసులు మాత్రం నిత్యం నరకం అనుభవిస్తున్నారు. ఎడతెరిపి లేకుండా జరుపుతున్న దాడులతో ఇజ్రాయెల్ సాగిస్తున్న దురాక్రమణ యుద్ధం అన్ని హద్దులూ దాటిపోయిందని చెప్పవచ్చు. ఇజ్రాయెల్ దాడుల్లో మరణించినవారి సంఖ్య 60 వేలు దాటడం ప్రపంచాన్ని దిగ్భ్రమకు గురిచేస్తున్నది. మృతుల్లో అత్యధికులు మహిళలు, చిన్నపిల్లలే కావడం మరీ దారుణం. సుమారు రెండేండ్లుగా గాజా ఆహార కొరతను ఎదుర్కొంటున్నది. ఇటీవలి కాలంలో ఇజ్రాయెల్ అష్టదిగ్బంధం చేస్తుండటం వల్ల ఆహార పదార్థాలు బాధితులకు చేరుకోవడం గగనమవుతున్నది. ఫలితంగా పోషకాహార లోపం ప్రమాదకర స్థాయికి చేరుకుందని సుమారు వందకు పైగా అంతర్జాతీయ ఏజెన్సీలు పేర్కొన్నాయి.
గాజాలో ప్రతి ఐదుగురు పిల్లల్లో ఒకరు తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. వారి సంఖ్య కేవలం రెండు నెలల్లోనే మూడింతలు కావడం ప్రమాద ఘంటికలు మోగిస్తున్నది. గాజాలో ఆహార సమస్య సంక్షోభంగా మారుతున్నదని ఇది సూచిస్తున్నది. ప్రపంచదేశాలు, ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ సహాయం అందించేందుకు ప్రయత్నిస్తున్నాయి. కానీ, ఇజ్రాయెల్ సహాయ బృందాలపైనా దాడులు జరుపుతుండటం తీవ్రమైన మానవీయ సంక్షోభానికి దారితీసింది.
Also Read..
Pak army chief | భారత్‌తో టారిఫ్ ఉద్రిక్తతల వేళ.. మరోసారి అమెరికాకు పాక్ ఆర్మీ చీఫ్