Indian help | తుర్కియేలో భారీ భూకంపానికి చెల్లాచెదురైన ప్రజలకు భారతదేశం అండగా నిలిచింది. ఇప్పటికే ఆరు విమానాల్లో సహాయక సామగ్రిని తరలించగా.. ఏడో కార్గో విమానం ఆదివారం ఉదయం తుర్కియేలోని అదానా చేరుకున్నది. దాదాపు 13 టన్నుల బరువును మోసుకెళ్లిన ఈ కార్గో విమానంలో వెంటిలేటర్లు, మందులు, బ్లాంకెట్లు ఉన్నాయి. ఆపరేషన్ దోస్త్లో భాగంగా భారతదేశం తుర్కియేకు మానవతా సాయం అందిస్తున్నది.
ఇండియన్ ఎయిర్ఫోర్స్ C 17 గ్లోబ్మాస్టర్ తుర్కియే భూకంప బాధితుల కోసం 13 టన్నుల వైద్య పరికరాలు, సిరియా భూకంప బాధితుల కోసం 24 టన్నుల సహాయంతో దిగింది. భారత రాయబారి డాక్టర్ వీరేందర్ పాల్, డిఫెన్స్ అటాచ్ కల్నల్ మనుజ్ గార్గ్ అదానా విమానాశ్రయంలో టర్కీ అధికారులతో కలిసి సరుకును అందుకున్నారు. టర్కీలోని ఇస్కెన్డెరున్లోని 60 పారా ఫీల్డ్ హాస్పిటల్ కోసం వెంటిలేటర్ యంత్రాలు, అనస్థీషియా యంత్రాలు, ఇతర వైద్య పరికరాలు, మందులను టర్కీ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తరఫున అంబాసిడర్ మెహ్మెట్ స్వీకరించారు.
భూకంపం సంభవించిన తర్వాత భారత్ నుంచి పెద్ద ఎత్తున ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్లో పాలుపంచుకునేందుకు తుర్కియే వెళ్లారు. అక్కడి శిథిలాల కింద సజీవంగా ఉన్న పలువురిని క్షేమంగా బయటకు తీసి ఆసుపత్రులకు పంపించడంలో సహకరిస్తున్నారు. కాగా, తదుపరి అందిన సమాచారం ప్రకారం ఇండియన్ ఆర్మీ ఆసుపత్రిలో ప్రతిరోజూ 400 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. వీరికి నర్సింగ్ సేవలను అందిస్తూ త్వరగా కోలుకునేలా చేస్తున్నారు. కాగా, తుర్కియే, సిరియాలో సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్య 28 వేలకు చేరుకున్నది.