Deportation | న్యూయార్క్, మార్చి 29: లక్షలాది రూపాయల అప్పు చేసి అగ్రరాజ్యం అమెరికాకు ఉన్నత విద్యకు వెళ్లిన భారతీయులు ఇప్పుడు కళ్లముందే డాలర్ డ్రీమ్స్ చెదిరిపోతుండటంతో బావురుమంటూ నిస్సహాయంగా దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. పోనీ భారత్‌కు తిరిగి వెళ్లిపోదామంటే లక్షలాది రూపాయల అప్పు, తల్లిదండ్రులు తమపై పెట్టుకున్న ఆశలు కళ్ల ముందు కదలాడుతూ తీవ్ర అనిశ్చితితో కొట్టుమిట్టాడుతున్నారు.
ట్రంప్ తాజా వలస నిబంధనలు, పార్ట్‌టైమ్ ఉద్యోగాలపై ఆంక్షలు, దేశ బహిష్కరణ శిక్షలతో వారు క్షణమొక యుగంలా గడుపుతున్నారు. 27 ఏండ్ల భారతీయ విద్యార్థి ఒకరు రెడిట్‌లో తన అనుభవాన్ని పంచుకుంటూ.. ‘అమెరికాలో మాస్టర్స్ చేయడానికి 40 లక్షల అప్పు చేసి 2022లో ఇక్కడకు వచ్చా. పలు కారణాలతో ఉద్యోగం రాకపోవడంతో బలవంతంగా భారత్‌కు తిరిగొచ్చేయాల్సి వచ్చిం ది. ఇక్కడ నేను సంపాదించిన ఉద్యోగం ద్వారా 75 వేలు వస్తున్నాయి.
అయితే అందులో 66 వేలు బ్యాంక్ లోన్ ఈఎంఐకే పోతున్నాయి. నెలకు రూ.9 వేలతో ఐదుగురు సభ్యుల కుటుంబాన్ని పోషిస్తూ భారంగా జీవితాన్ని నెట్టుకొస్తున్నానని’ అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ట్రంప్ రాకతో విద్యార్థులకు ఎక్కువ కష్టాలు అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి రావడంతో వీసా, వలస నిబంధనలు కఠినతరం చేయడంతో పలువురు భారత విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అగ్రదేశానికి వెళ్లి ఉంటున్న వారిలో అధికంగా 25-32 ఏండ్ల వారు ఉంటున్నారు. విదేశాలకు వెళ్లి మాస్టర్స్ పూర్తి చేసినా, పరిమిత ఉద్యోగ అవకాశాల కారణంగా వీరు తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఎప్పుడు ఏ అధికారి వస్తాడో, తమను దేశం నుంచి బహిష్కరిస్తారోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఒక ఇమ్మిగ్రేషన్ స్టడీస్ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం 2023 ఆర్థిక సంవత్సరానికి 7 వేలకు పైగా భారతీయ విద్యార్థులు వీసా గడువు ముగిసినా అక్కడే నివసిస్తున్నారు. ఇలా ఉంటున్న అంతర్జాతీయ విద్యార్థులలో భారతీయులే అధికం. ఐటీలో గ్రాడ్యుయేట్ అయిన 26 ఏండ్ల విద్యార్థి మాట్లాడుతూ ఇక్కడ ఉండటం కోసం నిత్యం అధికారులతో పిల్లి-ఎలుక ఆట ఆడాల్సి వస్తున్నదని, ఇలా ఎంతకాలం ఉండగలమని ప్రశ్నించాడు.
‘నేను వలస నిబంధనలను ఉల్లంఘిస్తున్నానని నాకు తెలుసు. అయినప్పటికీ చట్టబద్ధంగా ఇక్కడ ఉండటానికి ప్రయత్నిస్తున్నా. అయితే ట్రంప్ వచ్చాక పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు భారత్‌కు వెళ్లిపోవడం తప్ప నాకు మరో మార్గం కన్పించడం లేదు.’ అని కాన్సస్‌లోని 27 ఏండ్ల ఫైనాన్స్ గ్రాడ్యుయేట్ ఆవేదన వ్యక్తం చేశాడు. చేతులు, కాళ్లకు సంకెళ్లతో మన దేశానికి ఒక నేరస్థునిలా బలవంతంగా వెళ్లే కంటే ఇప్పుడే గౌరవంగా వెళ్లడం మంచిది కదా అని అన్నాడు.
అమెరికాలో మాస్టర్స్ చేసి తప్పనిసరి పరిస్థితుల్లో భారత్‌కు వచ్చే విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలకు లోటు లేదని, అయితే వారు అక్కడి జీతాలతో ఇక్కడి జీతాలను పోల్చడం వల్లే చిక్కు వస్తున్నదని కార్పొరేట్ సంస్థలో హెచ్ఆర్ హెడ్‌గా ఉన్న ఒక్కరు తెలిపారు. డాలర్, రూపాయి విలువల్లో తేడా కారణంగా ఇక్కడి కన్నా అక్కడ రెట్టింపు, మూడు రెట్లు జీతాలు ఉంటాయని, అలాగని, వారు ఇక్కడికి వస్తే ఇచ్చే జీతాలు తక్కువేమీ కావని ఆయన చెప్పారు.