Donald Trump | అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు ముగిశాయి. ఎన్నికల ఫలితాలు కూడా వెలువడుతున్నాయి. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాలన్నీ మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)కు అనుకూలంగానే ఉన్నాయి. అధ్యక్ష ఎన్నికల్లో మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లలో మెజారిటీ మార్కు 270. తాజా ట్రెండ్ ప్రకారం.. ట్రంప్ మెజారిటీ మార్క్ 270 ఓట్లను సాధించారు. కమలా హారిస్ మాత్రం 214 వద్దే ఆగిపోయారు. అయితే పూర్తి ఫలితాలు రావడానికి కొంత సమయం పడుతుంది. ఈ క్రమంలో అధ్యక్ష పీఠం మాత్రం ట్రంప్‌దే అని అంతర్జాతీయ మీడియా అంచనా వేస్తోంది.
ఈ క్రమంలో ట్రంప్ అధ్యక్ష పదవిని చేపడితే భారత్‌కు మేలు చేకూరుతుందా..? లేదా..? అనేది ప్రస్తుతం తీవ్రంగా చర్చకు వస్తోంది. భారత్ కోణంలో చూస్తే ట్రంప్ అధ్యక్షుడైతే మంచిదా? భారతీయ మూలాలు ఉన్న కమలా హారిస్ అధ్యక్షురాలైతే మేలా? అనే ఆసక్తికర చర్చ భారత్‌తో పాటు ప్రవాస భారతీయుల్లో జరుగుతున్నది. ట్రంప్ గెలిస్తే.. భారత్‌తో సత్సంబంధాలు (India-US Relations) కొనసాగిస్తారా..? లేదా అనేదానిపై చర్చించుకుంటున్నారు. అయితే, ఎవరు గెలిచినా భారత్‌కు ఎలాంటి ఇబ్బందీ లేదన్న వాదనకూడా వినిపిస్తోంది.
ఆర్థిక విధానాలు
వాణిజ్యపరంగా భారత్‌కు అమెరికా చాలా కీలకం. భారతదేశ మొదటి 10 వాణిజ్య భాగస్వామ్య దేశాల్లో అమెరికాతోనే మనకు ట్రేడ్ సర్ప్లస్ ఉంది. అంటే మనం అమెరికా నుంచి చేసుకుంటున్న దిగుమతుల కంటే మనం అమెరికాకు చేస్తున్న ఎగుమతులే ఎక్కువ. భారత్‌తో వాణిజ్యం గురించి ట్రంప్ పదేపదే మాట్లాడుతున్నారు. దిగుమతులపై భారత్ ఎక్కువగా పన్నులు వేస్తున్నదని ఆయన ఆరోపిస్తున్నారు. తాను గెలిస్తే ఈ పరిస్థితిని మార్చేస్తానని చెప్తున్నారు. ఇది భారత్‌కు కొంత ఇబ్బందికరమే. మరోవైపు కమలా హారిస్ సైతం అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా విధానాలను రూపొందించవచ్చు. అయితే, ఇవి మరీ అసాధారణంగా ఉండకపోవచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి.
సాంకేతిక రంగం
ట్రంప్ గెలిచినా, కమలా హారిస్ గెలిచినా చైనాతో మాత్రం కొంత దూకుడుగానే వ్యవహరించవచ్చు. భారత్‌లో సెమీకండక్టర్ ఫాబ్రికేషన్ కేంద్రం ఏర్పాటుకు, ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీ, అంతరిక్ష, 6జీ మొబైల్ సాంకేతికత, సెమీకండక్టర్ వంటి అధునాతన సాంకేతికతలపై కలిసి పని చేసేందుకు భారత్, అమెరికా ఇటీవలే ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. సాంకేతిక రంగంలో చైనా ఆధిపత్యాన్ని తగ్గించేందుకు ప్రస్తుత బైడెన్ సర్కారు ప్రయత్నించింది. ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచినా బైడెన్ పాటించిన విధానాలను కొనసాగించవచ్చు. ఇది పరోక్షంగా భారత్‌కు మేలు కలిగిస్తుంది.
దౌత్య సంబంధాలు
గత కొన్ని దశాబ్దాలుగా అమెరికా అధ్యక్షుడిగా ఎవరు ఉన్నా, అధ్యక్షుడు రిపబ్లికన్ అయినా, డెమోక్రట్ అయినా భారత్‌తో మాత్రం సంబంధాలు బలపడుతున్నాయి. ట్రంప్ గెలిచినా, కమల గెలిచినా ఇదే కొనసాగవచ్చు. అయితే, ట్రంప్‌తో మన ప్రధాని మోదీకి మంచి సంబంధాలు ఉన్నాయి. ఇదే సమయంలో కమలా హారిస్‌కు భారతీయ మూలాలు ఉండటం కూడా భారత్‌తో సంబంధాలను బలోపేతం చేయవచ్చు.
వలస విధానం
వలస విధానం విషయంలో ట్రంప్ ఆలోచనలు, విధానాలు కొంత కఠినంగానే ఉంటాయి. ఈ ఎన్నికల్లోనూ ఆయన ఇమ్మిగ్రేషన్ విధానంపై ప్రధానంగా ప్రచారం చేస్తున్నారు. అక్రమ వలసదారులపై ట్రంప్ కఠినంగా వ్యవహరించవచ్చు. భారతీయులకు కీలకమైన హెచ్1బీ వీసాలపైనా పరిమితులు విధించవచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి. ఇమ్మిగ్రేషన్‌కు సంబంధించి కమలా హారిస్ విధానాలు కొంత వలసదారులకు అనుకూలంగా ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి.
Also Read..
Kamala Harris | ఓటమి నేపథ్యంలో.. ఎలక్షన్ నైట్ ప్రసంగాన్ని రద్దు చేసుకున్న కమలా హారిస్
Donald Trump | విజయం దిశగా ట్రంప్.. సెలబ్రేషన్స్ మూడ్‌లో మద్దతుదారులు
Raja Krishnamoorthi | ఇల్లినాయిస్లో భారతీయ అమెరికన్ రాజా కృష్ణమూర్తి విజయం