న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్నది. ఇటీవల తగ్గుతూ వచ్చిన మహమ్మారి తీవ్రత గత కొద్ది రోజులుగా పెరుగుతుండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ముప్పు పెరుగుతున్నది. ఈ సబ్ వేరియంట్‌పై చైనా ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తున్నది. మంగళవారం 24 గంటల్లో 5,280 కొత్త కేసులు నమోదయ్యాయి. 2020 ఫిబ్రవరి 12న చైనాలో అత్యధికంగా 14వేలకుపైగా కేసులు నమోదవగా.. రెండు రోజుల కిందట భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవడం భయాందోళనకు గురి చేస్తున్నది. చైనాతో పాటు పశ్చిమ యూరప్, బ్రిటన్, అమెరికాలో కేసులు కొత్త కేసులు పెరుగుతున్నాయి. కరోనా కేసులు పెరుగుతున్నాయని వియత్నాం, జర్మనీ, దక్షిణ కొరియా, ఫ్రాన్స్‌లో కేసులు ఇప్పటికే ధ్రువీకరించాయి. ఇక్కడ రోజువారీ కేసులు ఒక్కసారిగా పెరుగుతున్నాయి.
యూరోప్‌లో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ (BA.2) వేగంగా వ్యాప్తి చెందుతున్నది. గణాంకాలను పరిశీలిస్తే యూకేలో 77శాతం కేసులు పెరిగాయి. అలాగే దక్షిణ కొరియా, వియత్నాం, ఫ్రాన్స్, జర్మనీల్లోనూ భారీగా కేసులు వెలుగు చూస్తున్నాయి. అయితే, ఐరోపాలో అకస్మాత్తుగా కరోనా మహమ్మారి మళ్లీ పెరగడానికి బలహీన మైన రోగనిరోధశక్తితో పాటు వైరస్ సోకిన వ్యక్తిని ఆసుపత్రికి తీసుకువెళ్లే ప్రక్రియ నెమ్మదిగా సాగుతుండడమే కారణమని ఐఐఎం కొచ్చి రీసెర్స్ సెల్ హెడ్ డాక్టర్ రాజీవ్ జయదేవన్ పేర్కొన్నారు. అలాగే కొవిడ్ ఆంక్షల్లో సడలింపులు ఇవ్వడం కూడా కారణమని నిపుణులు పేర్కొంటున్నారు.
ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు కేవలం చైనాకే పరిమితం కాలేదని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థల ప్రకారం.. ఒమిక్రాన్ ఐదు వేరియంట్లు ఉన్నాయి. ఇందులో ఒకటి బీఏ.2. ఇది ఒమిక్రాన్ బీఏ.1 కంటే పది రెట్లు వేగంగా సోకుతుంది. బీఏ2 వేరింట్ ఉనికి ఇప్పటికీ చాలా దేశాల్లో ఉన్నందున పెరుగుతున్న కరోనా కేసులు చైనా, యూరప్‌కి మాత్రమే పరిమితం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఈ వేరియంట్ మొదటి కేసు గతేడాది నవంబర్‌లో దక్షిణాఫ్రికాలో నమోదైన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొద్ది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది.
చైనా కంటే భారత్ ప్రజల్లో రోగనిరోధశక్తి మెరుగ్గానే ఉన్నది. అంతే కాకుండా దేశంలో టీకాల పంపిణీ కార్యక్రమం వేగంగా సాగుతున్నది. దీంతో ఇమ్యునిటీ మరింత బలంగా మారింది. చైనాతో పోలిస్తే భారత్‌లో కేసులు పెరగకపోవడానికి కారణం ఇదేనని నిపుణులు చెబుతున్నారు. మరో వైపు కొవిడ్ టాస్క్‌ఫోర్స్ అధిపతి డాక్టర్ నరేంద్ర కుమార్ అరోరా మాట్లాడుతూ.. భారత్‌లో ఒమిక్రాన్ సబ్ వేరియంట్లకు సంబంధించి కేసులు పెరగడానికి చాలా తక్కువ అవకాశం ఉందన్నారు. మూడో వేవ్‌లో కేవలం 72శాతమే బీఏ.2 కేసులు రికార్డయ్యాయన్నారు.