Bangladesh | ఢాకా : బంగ్లాదేశ్‌లో హిందూ మత వ్యతిరేక అల్లర్లు కొనసాగుతున్నాయి. తాజాగా పోర్ట్ సిటీ చిట్టగ్యాంగ్‌లోని హరీశ్చంద్ర మున్సఫ్ లేన్‌లో ఉన్న శంతనేశ్వరి మాత్రి ఆలయంతోపాటు సమీపంలోని సోనీ ఆలయం, శంతనేశ్వరి కలిబరీ ఆలయాలను లక్ష్యంగా చేసుకున్న దుండగులు శుక్రవారం దాడి చేసి ధ్వంసం చేశారు. వందలాది మంది ఆందోళనకారులు హిందూ, భారత వ్యతిరేక నినాదాలు చేస్తూ ఇటుకలతో ఆలయాలపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. అయితే, పోలీసులు మాత్రం ఈ ఘటనను తేలిగ్గా తీసుకున్నారు. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు ఇటుకలు విసురుకునే క్రమంలో ఆలయాలు స్వల్పంగా దెబ్బ తిన్నాయని పేర్కొన్నారు. మిలటరీ రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చింది. మరోవైపు ఇస్కాన్‌కు చెందిన హిందూ పూజారి శ్యామ్ దాస్, మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల అరెస్టయిన హిందూ, ఇస్కాన్ నేత చిన్మయ్ కృష్ణ దాస్‌ను కలిసేందుకు జైలుకు వెళ్లిన సమయంలో శ్యామ్ దాస్‌ను, మరో వ్యక్తిని అరెస్టు చేశారని, అలాగే కృష్ణ దాస్ కార్యదర్శి కూడా అదృశ్యం అయ్యారని ఇస్కాన్ కోల్‌కతా అధికార ప్రతినిధి రాధారామన్ దాస్ తెలిపారు. దీనిపై బంగ్లాదేశ్ అధికారిక ప్రకటన చేయలేదు. మరోవైపు భైరవ్లో ఉన్న ఇస్కాన్ కేంద్రంలో కొందరు దుండగులు విధ్వంసం సృష్టించారు. ఇందుకు సంబంధించిన వీడియోను రాధారామన్ దాస్ ట్వీట్ చేశారు.
ఇక నుంచి బంగ్లాదేశ్‌కు చెందిన వారికి చికిత్స చేయొద్దని కోల్‌కతాలోని జేఎన్ రే దవాఖాన నిర్ణయించింది. బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై దాడులు, భారత దేశ జెండాను అవమానించిన ఘటనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు దవాఖాన అధికారి సుభ్రాంశు భక్త్ వెల్లడించారు.
ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరిచేందుకు ఢాకా దీర్ఘకాల ద్వైపాక్షిక ఆందోళనలను భారత దేశం పరిష్కరించాల్సి ఉందని, అయితే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సత్సంబంధాలపై తాము ఇంకా ఆశాజనకంగా ఉన్నట్టు బంగ్లాదేశ్ స్పష్టం చేసింది. ఇస్కాన్ నేత కృష్ణదాస్ అరెస్ట్‌తో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న క్రమంలో శనివారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో బంగ్లా విదేశీ వ్యవహారాల సలహాదారు తౌహిద్ హొస్సేన్ మాట్లాడారు. ఆగస్టు 5 తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాల మధ్య మార్పు చోటుచేసుకున్న మాట వాస్తవమేనన్నారు.
బంగ్లాలో హిందూ నేత అరెస్ట్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారని, అతడిని ఒక నిర్దేశిత ఆరోపణలతో అరెస్ట్ చేసినట్టు బంగ్లాదేశ్ సమర్థించుకుంది. యూఎన్ ఫోరమ్‌లో మైనారిటీల సమస్యలపై నిర్వహించిన సమావేశం సందర్భంగా జెనీవాలోని ఐరాస బంగ్లాదేశ్ శాశ్వత ప్రతినిధి, దౌత్యవేత్త తెరిక్ ఎండీ ఆరిఫుల్ ఇస్లామ్ ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై ఎలాంటి క్రమబద్ధమైన దాడి జరగలేదని హిందూ నేత అరెస్ట్ అంశం తమ న్యాయస్థానం పరిధిలో ఉందని ఆయన స్పష్టం చేశారు. కాగా, బంగ్లాదేశ్‌లో పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్నాయని, మైనారిటీలపై నిత్యం దాడులు కొనసాగుతున్నాయని ఇంటర్నేషనల్ ఫోరమ్ ఫర్ సెక్యులర్ బంగ్లాదేశ్ (ఐఎఫ్ఎస్బీ) ప్రతినిధి ఒకరు సమావేశంలో ఆరోపించారు.