ఢాకా, జూన్ 20: శ్రీరాముడిని అగౌరవ పరిచినందుకు నిరసనగా బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో హిందూ సంఘం సభ్యులు కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ఒక హింసాత్మక గుంపు శ్రీరాముడి విగ్రహాన్ని అపవిత్రం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనకు బాధ్యులైన వారిని అరెస్టు చేయకపోతే ఆదివారం మత వ్యవహారాల మంత్రిత్వశాఖకు వినతిపత్రం అందచేస్తామని హిందూ సంఘం సభ్యులు 72 గంటల గడువు విధించారు. శుక్రవారం షహబాగ్ కూడలి వద్ద ప్రారంభమైన భారీ కాగడాల ప్రదర్శన షహబాగ్ చౌక్ మీదుగా, మోటేశ్వర్ భవన్ గుండా నేషనల్ ప్రెస్‌క్లబ్ వరకు సాగింది.
ఈ ప్రదర్శనలో పాల్గొన్నవారు జైశ్రీరామ్ నినాదాలు చేశారు. శ్రీబందలోని పోలాష్ బరీరి వద్ద సనాతన్ కాంప్లెక్స్‌లో శ్రీరాముడి విగ్రహ నిర్మాణం ఆగిపోవడం గమనార్హం. గాయ్బంధలోని పోలాష్ బరీ వద్ద 81 అడుగుల ఎత్తైన శ్రీరాముడి విగ్రహంతోపాటు రామాలయ నిర్మాణం పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. తీవ్రవాద వర్గాలు అశాంతిని సృష్టిస్తున్నాయన్న ఆరోపణల కారణంగా ఆలయ నిర్మాణం నిలిచిపోయింది. అయితే అనుమానితులను అరెస్టు చేయకపోవడంతో నిరసనకారులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. పోలాష్ బరీలో మాత్రమే కాకుండా దేశంలోని 64 జిల్లాల్లో రామాలయాలను నిర్మిస్తామని నిరసనకారులు స్పష్టం చేశారు.