Hijab | సంప్రదాయ ముస్లిం దేశమైన ఇరాన్ (Iran)లో మహిళలపై అణచివేత కొనసాగుతోంది. తాజాగా మహిళల డ్రెస్ కోడ్ (Dress Code)పై ఇరాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇస్లాం సంప్రదాయం ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో మహిళలు కచ్చితంగా హిజాబ్ (Hijab ) ధరించాల్సిందే అని స్పష్టం చేసింది. హిజాబ్ ధరించేందుకు విముఖత వ్యక్తం చేసే మహిళలకు, వారికి మద్దతు తెలిపే వారిపై భారీ శిక్షలు విధించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఓ ప్రత్యేక బిల్లును (stricter headscarf law ) తీసుకొచ్చింది. ఈ ప్రత్యేక బిల్లుకు ఇరాన్ పార్లమెంట్ (Iran parliament ) బుధవారం ఆమోదం తెలిపింది.
హిజాబ్ ధరించకుండా విధులు నిర్వహించేందుకు అనుమతించే వ్యాపార సంస్థలతో పాటు హిజాబ్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టే కార్యకర్తలపై కూడా శిక్షలు విధించనుంది. ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారికి కనీసం 10 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. 290 మంది సభ్యులు కలిగిన ఇరాన్ పార్లమెంటులోని 152 మంది సభ్యులు ఈ బిల్లును బుధవారం ఆమోదించారు. కాగా, ఈ బిల్లు రాజ్యాంగపరమైన నిఘా సంస్థగా పనిచేసే మతాధికార సంస్థ గార్డియన్ కౌన్సిల్ ఆమోదం పొందాల్సి వుంది. గతేడాది హిజాబ్ వివాదం కారణంగా పోలీస్ కస్టడీలో మహసా అమిని అనే 22 ఏళ్ల యువతి మృతి చెందిన విషయం తెలిసిందే. యువతి మృతిచెంది సరిగ్గా ఏడాది పూర్తైన నేపథ్యంలో ఇరాన్ ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చింది.
సంప్రదాయ ముస్లిం దేశమైన ఇరాన్లో మహిళలపై ఆంక్షలు చాలా ఎక్కువ. వాళ్ల డ్రెస్ కోడ్‌పై మోరల్ పోలీసుల నిఘా ఉంటుంది. హిజాబ్ సరిగా ధరించలేదనే కారణంతో మహిసాను గతేడాది సెప్టెంబర్ 20వ తేదీన మోరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత మూడు రోజులకు ఆమె పోలీసు కస్టడీలో చనిపోయింది. 2022 సెప్టెంబర్ 16న జరిగిన ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ప్రజలు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాదాపు 3 నెలలుగా హిజాబ్, మోరల్ పోలీసింగ్ వ్యతిరేక నినాదాలు, నిరసనలతో ఇరాన్ అట్టుడికింది. ఈ నిరసనల్లో సుమారు 500 మందికిపైగా పౌరులు చనిపోయారు. సుమారు 22 వేల మందికి పైగా ఆందోళనకారులను అక్కడి అధికారులు నిర్బంధించారు. ఇరాన్లో 1979 విప్లవం తర్వాత ఈ స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకత పెరగడం ఇదే మొదటిసారి. ప్రజల నిరసనలతో దిగొచ్చిన ఇరాన్ ప్రభుత్వం మోరల్ పోలీసింగ్ వ్యవస్థను కూడా నిషేధించింది.
Also Read..
India-Canada | కెనడాతో వివాదం.. భారత్‌కు ప్రత్యేక మినహాయింపు ఏమీ లేదన్న అమెరికా
Chennai cabbie | కారు డ్రైవర్ ఖాతాలో రూ.9వేల కోట్లు జమ..!
Parineeti-Raghav Chadha | ఉదయ్‌పూర్ చేరుకున్న కాబోయే కొత్త జంట.. పిక్స్ వైరల్