ఇస్లామాబాద్, ఆగస్టు 15: భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు అతలాకుతలం చేయడంతో పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లలో 200 మందికి పైగా మరణించగా, పలువురు గాయపడ్డారు. పదుల సంఖ్యలో పౌరులు గల్లంతయ్యారు. గత 24 గంటలుగా పలు ప్రాంతాలను భారీ వానలు, వరదలు ముంచెత్తాయి.
ముఖ్యంగా ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు, వరదలు కారణంగా 125 మందికి పైగా మరణించగా, భారీ ఆస్తి నష్టం ఏర్పడింది. పీవోకేలో పలు ఇళ్లు, పాఠశాలలు, వాహనాలు, ఆరోగ్య యూనిట్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పలు చోట్ల వందలాది మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.