పారిస్: అతి తీవ్రతతో వీచిన వడగాడ్పుల కారణంగా ఫ్రాన్స్‌లో వారం రోజుల వ్యవధిలో వెయ్యి మంది వరకు పౌరులు మరణించినట్టు ఆ దేశ ఆరోగ్య శాఖ అధికారులు ఆదివారం వెల్లడించారు. ఊహించిన దానికన్నా ఎక్కువగా మరణాలు సంభవించాయని, మృతుల్లో 85 శాతం మంది వృద్ధులు ఉన్నట్టు వారు తెలిపారు. జూన్ 24 నుంచి సుమారు వెయ్యి మంది వరకు మరణించారని, గత నెలతో పోలిస్తే ఇది ఎక్కువని ఫ్రాన్స్ ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో పేర్కొన్నది. ఫ్రాన్స్ మీడియా సంస్థ ఏఎఫ్‌పీ కథనం ప్రకారం వడగాడ్పుల గురించి రెడ్ అలర్ట్ ప్రకటించిన ప్రాంతాల్లో దుష్ప్రభావం ఎక్కువగా కన్పించిందని, మరణించిన 85 శాతం మంది వృద్ధుల్లో 65, ఆపై వయసు ఉన్నవారేనని తెలిపింది. గత కొన్ని రోజులుగా దేశంలోని పలు చోట్ల 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతుండటంతో తీవ్రమైన వేడి, వడగాడ్పులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఆదివారం ఫ్రాన్స్‌లో వేడి తీవ్రత తగ్గిందని అధికారులు ప్రకటించారు.