Hamas | జెరూసలెం, ఆగస్టు 1: ఒక వైపు తమపై యుద్ధానికి ఇరాన్ సహా పలు ఉగ్రవాద సంస్థలు సన్నద్ధమవుతున్నా ఇజ్రాయెల్ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. జూలై 13న తాము జరిపిన వైమానిక దాడిలో హమాస్ మిలటరీ వింగ్ చీఫ్ మహ్మద్ డెయిఫ్ హతమైనట్టు ఇజ్రాయెల్ గురువారం నిర్ధారించింది. గత ఏడాది అక్టోబర్ 7న తమ దేశంపై జరిగిన దాడిలో డెయిఫ్, హనియా ప్రధాన సూత్రధారులని తెలిపింది. పలుమార్లు డెయిఫ్ తమకు చిక్కినట్టే చిక్కి తప్పించుకున్నాడని, జూలైలో గాజాలో జరిగిన దాడిలో ఎట్టకేలకు హతమయ్యాడని ఇజ్రాయెల్ ప్రకటించింది. దీనిపై హమాస్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి అనంతరం ఎట్టి పరిస్థితుల్లో హమాస్ చీఫ్ హనియాను, ఇతర నేతలను హతమార్చి తీరుతామంటూ ఆ దేశం ప్రతిజ్ఞ చేసింది.
యుద్ధానికి మేము రెడీ..
ఇరాన్, దాని మిత్ర దేశాలు జరిపే ఎలాంటి దాడినైనా ఎదుర్కోవడానికి పూర్తి సన్నద్ధతతో ఉన్నామని ఇజ్రాయెల్ వెల్లడించింది. కాగా హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హత్యకు ఇజ్రాయెలే కారణమంటూ ఇరాన్, హమాస్ ఆరోపిస్తుండగా, ఇజ్రాయెల్ మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ఇస్మాయిల్ హత్య అనంతరం ‘మాకు వ్యతిరేకంగా ప్రదర్శించే ఎలాంటి దూకుడుకైనా భారీ మూల్యం తప్పదు’ అని ఇజ్రాయెల్ ప్రధాని వ్యాఖ్యానించారు.