Strait Of Hormuz : హార్ముజ్ జలసంధి వద్ద మళ్లీ ఉద్రిక్త పరిస్తితులు నెలకొంటున్నాయి. తాజాగా హార్ముజ్ జలసంధిని దాటేందుకు ప్రయత్నిస్తున్న రెండు నౌకలపై ఇరాన్‌లోని ఐఆర్‌జీసీకి చెందిన గన్ బోట్స్ కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఎలాంటి హెచ్చరిక, సమాచారం లేకుండానే ఈ కాల్పులు జరిగినట్లు నౌకలోని కెప్టెన్లు తెలిపినట్లు బ్రిటన్‌కు చెందిన మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సంస్థ వెల్లడించింది. అయితే, ఈ కాల్పుల్లో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని వివరించింది. మరోవైపు ఇండియాకు చెందిన చమురు నౌక ఒకటి శనివారం హార్ముజ్ జలసంధిని దాటింది.
దేశ్ గరిమ అనే నౌక ఈ జలసంధిని దాటినట్లు అక్కడి ట్రాఫిక్ డాటా ద్వారా తెలిసింది. యుద్ధం ప్రారంభమైన తర్వాత జలసంధిని దాటిన పదో భారత నౌక ఇది. ఖతార్‌లోని రస్ లాఫ్ఫాన్ పోర్టు నుంచి ఈ నౌక ఇండియాకు వస్తోంది. ప్రస్తుతం గల్ఫ్ ఆఫ్ ఒమన్ వద్ద ఈ నౌక ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ రోజు హార్ముజ్ నుంచి వివిధ దేశాలకు చెందిన ఎనిమిది నౌకలు దాటినట్లు అంచనా. హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేస్తున్నట్లు ప్రకటించడానికి ముందే ఈ నౌకలు ఈ ప్రదేశాన్ని దాటి ఉండొచ్చు. ప్రస్తుతం హార్ముజ్‌ను ఇరాన్ మూసేసిన నేపథ్యంలో మళ్లీ నౌకల రవాణా నిలిచిపోనుంది. హార్ముజ్ ప్రస్తుతం ఇరాన్ మిలిటరీ నియంత్రణలో ఉంది. ఇంకోపక్క లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. ఆ దేశంతో ఇరాన్ పది రోజులపాటు కాల్పుల ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఒక పక్క ఈ ఒప్పందం ఉన్నప్పటికీ లెబనాన్‌లోని హెజ్బొల్లా తీవ్రవాద సంస్థపై దాడి చేసినట్లు ఇజ్రాయెల్‌కు చెందిన ఐడీఎఫ్ (ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్) తెలిపింది.
దక్షిణ లెబనాన్‌లోని యెల్లో లైన్ వద్ద ఉన్న తీవ్రవాదులు కాల్పుల విరమణ నిబంధనలు ఉల్లంఘించడంతో తాము దాడులు చేశామని ఇజ్రాయెల్ తెలిపింది. మరోవైపు ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజా హెచ్చరిక జారీ చేశారు. ఈ రెండు దేశాల మధ్య పాకిస్తాన్ వేదికగా సోమవారం రెండో దశ చర్చలు జరగనున్న నేపథ్యంలో ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. బుధవారం లోపు ఇరాన్ తమతో ఒప్పందం కుదుర్చుకోకపోతే.. మళ్లీ దాడులు చేస్తామని హెచ్చరించారు.