న్యూఢిల్లీ: గ్రీన్‌లాండ్‌ని స్వాధీనం చేసుకోవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల చేస్తున్న ప్రయత్నాలకు అనుగుణంగా ఆ డానిష్ భూభాగాన్ని అమెరికాలో 51వ రాష్ట్రంగా మార్చడానికి అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రాండి ఫైన్ ఓ బిల్లును ప్రవేశపెట్టారు. గ్రీన్లాండ్ విలీనం, రాష్ట్రప్రతిపత్తి చట్టం పేరిట ఓ బిల్లును రిపబ్లికన్ సభ్యుడు ఫైన్ సోమవారం ప్రవేశపెట్టినట్లు ఆయన కార్యాలయం తెలిపింది. బిల్లులో పేర్కొన్న అంశాల ప్రకారం గ్రీన్లాండ్ విలీనాన్ని పూర్తి చేసి ఆ తర్వాత దానికి అమెరికాలో రాష్ట్ర హోదా కల్పించడం.
గ్రీన్లాండ్ అమెరికా విస్మరించగల సుదూర ప్రదేశం కాదని, ఇది తమకు ఓ ముఖ్యమైన జాతీయ భద్రతా ఆస్తి అని ఫైన్ తన బిల్లులో పేర్కొన్నారు. గ్రీన్లాండ్ ఎవరి నియంత్రణలో ఉంటే వారు కీలకమైన ఆర్కిటిక్ నౌకామార్గాలను, అమెరికాను రక్షించే భద్రతాపరమైన నిర్మాణాన్ని నియంత్రించగలరని ఆయన తెలిపారు. అమెరికా విలువలను తృణీకరించి అమెరికా భద్రతను విస్మరించే పాలకుల చేతుల్లో ఆ భవిష్యత్తును అమెరికా విడిచిపెట్టలేదని ఫైన్ తెలిపారు. డెన్మార్క్‌తో చర్చలు జరపడం లేదా అమెరికా భూభాగంగా గ్రీన్‌లాండ్‌ని స్వాధీనం చేసుకోవడంసహా అవసరమైన చర్యలను తీసుకునే అధికారాన్ని కట్టబెట్టేందుకు ఈ బిల్లు ఉద్దేశించినదని ఆయన పేర్కొన్నారు.