బ్రిస్బేన్, ఏప్రిల్ 29: ఆస్ట్రేలియా ప్రభుత్వం త్వరలో తీసుకోబోయే చర్యలతో టెక్ దిగ్గజాలు తాము అందిస్తున్న వార్తా సమాచారానికి గాను భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. టిక్‌టాక్, గూగుల్, మెటా వంటి టెక్ దిగ్గజాలు స్థానిక మీడియా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోవాలని లేదా తామే ప్రభుత్వానికి కోట్ల రూపాయల్లో పన్ను చెల్లించాల్సి ఉంటుందని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.
ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న నూతన విధానం ప్రకారం టెక్ దిగ్గజాలు స్థానిక ప్రచురణకర్తలతో ఒప్పందం చేసుకొనే వరకూ తాము ఆర్జిస్తున్న ఆదాయంలో 2.25 శాతం ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ఆ సొమ్మును ఆస్ట్రేలియా జర్నలిజం అభివృద్ధికి వినియోగిస్తామని ప్రభుత్వం తెలిపింది. ప్రజలు టిక్‌టాక్, ఫేస్బుక్, గూగుల్ వంటి సామాజిక మాధ్యమాల నుంచి రోజువారీ వార్తలు తెలుసుకొంటున్నారని ఆస్ట్రేలియా కమ్యూనికేషన్ల శాఖ మంత్రి అనికా వెల్స్ చెప్పారు.