Pakistan Gold Rate | దాయాది దేశం పాకిస్థాన్ (Pakistan) గతంలో ఎన్నడూ లేనంత తీవ్ర ఆర్థిక సంక్షోభంతో (Economic Crisis) కొట్టుమిట్టాడుతోంది. ఆ దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ ఆకాశాన్నంటుతున్నాయి. ఏది కొనాలన్నా తలకు మించిన భారం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మనకు నిత్యం ఉపయోగపడే పాల (Milk)నుంచి.. చికెన్ (Chiken) వరకు అన్ని ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. డీజిల్ (Petrol), పెట్రోల్ (Diesel) ధరలు కూడా రూ.300కు చేరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ పసిడి ధరలు (Gold Rates) ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారిపోయాయి. తాజా సమాచారం ప్రకారం.. పాక్‌లో తులం బంగారం ఏకంగా లక్షల్లో పలుకుతోంది.
స్థానిక మీడియా వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. కరాచీ (Karachi), లాహోర్ (Lahore), ఇస్లామాబాద్ (Islamabad), పెషావర్ (Peshawar), క్వెట్టా ( Quetta) తదితర ప్రధాన నగరాల్లో తులం బంగారం (పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి) ఏకంగా రూ.2 లక్షలకు పైనే పలుకుతోంది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన పసిడి రూ.2.06 లక్షలుగా (పాకిస్థాన్ కరెన్సీ ప్రకారం)గా ఉంది. దీంతో బంగారం దుకాణాలు వెలవెలబోతున్నాయి.
ఒక్క డీజిల్, పెట్రోలే కాదు.. పాక్‌లో అన్ని రకాల నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పాకిస్థాన్‌లో పాల ధర లీటరుకు ఏకంగా రూ.210కి చేరింది. ఇక లైవ్ చికెన్ ధరలు రూ.800కి చేరువలో ఉన్నాయి. బోన్‌లెస్ చికెన్ ధర కిలోకు రూ.1,000-1,100కి చేరింది. మరోవైపు విదేశీ మారకద్రవ్యం తగినంతగా లేకపోవడంతో దిగుమతులు అంతంతమాత్రంగా ఉన్నాయి.
మరోవైపు పాక్ కరెన్సీ విలువ కూడా దారుణంగా పడిపోతుంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే పాకిస్థాన్ రూపాయి విలువ దారుణంగా పడిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ప్రస్తుతం డాలర్‌తో పాక్ రూపాయి మారకం విలువ రూ.280కి పైన ట్రేడవుతోంది. పాకిస్థాన్ నెలవారీ ద్రవ్యోల్బణం ఫిబ్రవరి మాసంలో 31.6 శాతం పెరిగిపోయింది. దీంతో పాకిస్థాన్ రిజర్వ్ బ్యాంకు 300 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లను పెంచేసింది. రుణ వడ్డీ రేటు 20 శాతానికి చేరగా.. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు అనేక ప్రయత్నాలు చేస్తోంది. దివాళా కోరల్లో చిక్కుకోకుండా ఉండేందుకు పాక్ ప్రభుత్వం ఇటీవలే అంతర్జాతీయ ద్రవ్యనిధితో ఒప్పందం కుదుర్చుకుంది.
తీవ్ర ఆర్థిక సంక్షోభంతో విలవిలలాడుతున్న పాక్‌లో ఔషధాల కొరత కూడా నెలకొంది. మందులు దొరక్క.. వైద్యులు శస్త్రచికిత్సలను సైతం నిలిపివేయాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. దీంతో రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు. కిడ్నీ, గుండె, క్యాన్సర్ సహా పలు సున్నితమైన ఆపరేషన్ల సమయంలో రోగులకు ఇచ్చే అనస్థీషియా (మత్తు మందు) నిల్వలు కూడా రెండు వారాలకు సరిపడా మాత్రమే ఉన్నాయని స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. ముడి సరుకుల దిగుమతి లేకపోవడంతో ఔషధాల ఉత్పత్తి తగ్గిపోయిందని ఫార్మాస్యూటికల్ తయారీదారులు పేర్కొంటున్నారు.
Also Read..
China | అమ్మాయిల లోదుస్తుల ప్రకటనల్లో అబ్బాయిలు.. చైనా వ్యాపారుల కొత్త పంథా..!
IMA | సీజనల్ వ్యాధులకు యాంటీబయాటిక్స్ అవసరం లేదు : ఐఎంఏ
RRR | నాటు నాటు పాటను ఎంజాయ్ చేసిన దక్షిణ కొరియా సింగర్