బెర్లిన్ : ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం గురించి చర్చించేందుకు బ్రస్సెల్స్‌లో ఈనెల 24న జరిగే సదస్సుకు హాజరు కావాలని జీ7 దేశాలను జర్మన్ ఛాన్స్లర్ ఓలఫ్ ష్కోల్జ్ ఆహ్వానించారు. ఉక్రెయిన్‌లో తాజా పరిస్ధితి సహా వర్తమాన అంశాలపై అభిప్రాయాలను ఈ భేటీలో పంచుకోవచ్చని పేర్కొన్నారు. మరోవైపు ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతున్న రష్యా దూకుడుకు కళ్లెం వేసేందుకు రష్యన్ చమురుపై నిషేధం విధించాలని జర్మనీ యోచిస్తోంది. ఉక్రెయిన్‌పై దాడులు సాగిస్తున్న రష్యాపై చర్యలు చేపట్టే క్రమంలో ఆ దేశ చమురుపై నిషేధం విధించే విషయం పరిశీలిస్తామని జర్మన్ విదేశాంగ మంత్రి అనలీనా బెర్బాక్ సంకేతాలు పంపారు.
ఆర్ధిక, ఇంధన ప్రయోజనాల కోసం మౌనం దాల్చడం సరైంది కాదని, దీనిపై ఓ వైఖరి తీసుకోవడం ముఖ్యమని ఆమె స్పష్టం చేశారు. మరోవైపు ఉక్రెయిన్ శాంతి చర్చలను నిలిపివేస్తోందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ శుక్రవారం ఆరోపించారు. యుద్ధాన్ని ముగించేందుకు అవసరమైన పరిష్కారాల అన్వేషణకు రష్యా సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. పలు ఉక్రెయిన్ నగరాలు, పట్టణాలపై రష్యా బలగాలు కాల్పులతో విరుచుకుపడుతున్నాయి.
రష్యన్ బలగాల దాడుల్లో తూర్పు ప్రాంతంలో ముగ్గురు వ్యక్తులు మరణించారని ఉక్రెయిన్ ఎమర్జెన్సీ సర్వీస్ వెల్లడించింది. ఖర్ఖీవ్లోని ఓ బహుళ అంతస్తుల టీచింగ్ భవనంపై కాల్పులు జరిగాయని తెలిపింది. ఇక క్రమటోస్క్ నగరంలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మరణించగా ఆరుగురు గాయపడ్డారని గవర్నర్ పాలో క్రిలెంకో ఆన్లైన్ పోస్ట్‌లో వెల్లడించారు. రష్యా బలగాల కాల్పుల హోరుతో పలు పట్టణాలు, గ్రామాల నుంచి పౌరులను ఖాళీ చేయించే ప్రక్రియకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని ఉక్రెయిన్ తూర్పు లుహంక్ ప్రాంత గవర్నర్ పేర్కొన్నారు.