Alex Soros | బంగ్లాదేశ్ (Bangladesh) తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ (Muhammad Yunus)తో వివాదాస్పద అమెరికన్ బిలియనీర్, ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ (Open Society Foundations) అధినేత జార్జి సోరస్ (George Soros) కుమారుడు అలెక్స్ సోరస్ (Alex Soros) సమావేశమయ్యారు. ఈ విషయాన్ని యూనస్ ఆఫీస్ ఎక్స్ వేదికగా వెల్లడించింది. ఓపెన్ సొసైటీ ఫౌండేషన్‌కు చెందిన కీలక వ్యక్తులు చీఫ్ ఇంటీరియం అడ్వైజర్‌తో భేటీ అయినట్లు పేర్కొంది. బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థను ఎలా పునరుద్ధరించాలనే దానిపై ఇరువురూ చర్చించినట్లు తెలిపింది. అంతేకాకుండా, అసత్య ప్రచారాలతో ఎలా పోరాడాలి, ముఖ్య ఆర్థిక సంస్కరణలు వంటి అంశాలపై చర్చించినట్లు వెల్లడించింది.
రోహింగ్యా సంక్షోభం వంటి అంశాలపై కూడా వీరు ఇరువురూ చర్చించినట్లు స్థానిక మీడియా తెలిపింది. కాగా, మూడు నెలల వ్యవధిలో వీరిద్దరి మధ్య జరిగిన రెండో భేటీ ఇది. ముఖ్యంగా అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump).. బంగ్లాదేశ్ సహా పలు దేశాలకు నిధులను నిలిపివేస్తూ (halted foreign aid) నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ట్రంప్ నిర్ణయం తర్వాత వీరిద్దరు భేటీ కావడం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది.
సోరస్‌కు చెందిన ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ కొన్ని దేశాల్లో ప్రభుత్వాల మార్పిడికి ప్రోత్సహించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా తూర్పు ఐరోపా, పశ్చిమాసియా, లాటిన్ అమెరికాలోని కొన్ని దేశాల్లో వీరి పాత్రపై వదంతులు ప్రచారంలో ఉన్నాయి. ఇక బంగ్లాదేశ్‌లో హసీనా ప్రభుత్వం పతనం వెనుక కూడా ఈ సొసైటీ హస్తం ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. హసీనా ప్రభుత్వం కూలిపోయిన వెంటనే యూనస్ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా గతేడాది ఆగస్టు 8న బాధ్యతలు స్వీకరించారు. ఇక బాధ్యతలు స్వీకరించిన తర్వాత గతేడాది అక్టోబర్‌లో న్యూయార్క్‌లో అలెక్స్ సోరస్‌తో యూనస్ భేటీ అయ్యారు. ఇప్పుడు మరోసారి భేటీ కావడం ప్రధాన్యత సంతరించుకుంది.
Also Read..
Airplane Crash | హెలికాప్టర్‌ను ఢీకొట్టిన విమానం.. 18 మంది మృతి